వై కె ఒక భరోసా..!
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
వై.కె.నాగేశ్వరరావు నాకొక కుడి భుజం! ఆయనొక భరోసా! ఆయనొక ఓదార్పు! మా ఇద్దరికీ వయసు రీత్యా రెండు దశాబ్దాలకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మనసులు రెండూ ఒక్కటే! ఇద్దరివీ దాదాపు ఒక్కటే భావాలూ! ఇద్దరికీ సాంస్కృతిక రంగం ప్రాణం! నేను దేవుడ్ని నమ్ముతా! అయన నమ్మరు! ఇద్దరం విశాలంగా ఆలోచిస్తాం! ఇద్దరివీ పాజిటివ్ దృక్పథాలే! నెగటివ్ షేడ్స్ పట్టించుకోమ్! టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సాహిస్తాం! వేదిక కల్పిస్తాం! లబ్ద ప్రతిష్టులను గౌరవిస్తాం! ముందు తరాలకు స్పూర్తి ఇవ్వాలని శ్రమిస్తాం! నచ్చింది చేస్తాం! నచ్చనిది వదిలేస్తాం ! నచ్చని వారితో దూరంగా ఉంటాం! నవ్వుతూ హాయిగా ఉంటాం! సంకల్పిస్తే అయ్యే వరకు అంతు చూసేంత వరకు ప్రయత్నిస్తాం ! సక్సెస్ అయితే ఓహో అని పొంగిపోము! సాధించకపోతే అయ్యో అని కుమిలిపోము ! కుల మతాల పట్టింపులు చూడము ! మీన మేషాలు లెక్కించము! ఆర్ధిక లెక్కలు మాకు రావు! మిగిలితే మనది! మిగలక పోయినా బాధ లేదు! అంతా మన మంచికే అనుకునే మనస్తత్వం! అందుకే మా ఇద్దరికీ జోడీ కుదిరింది !
నేనొక ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ గా, ఆయనొక సాంస్కృతిక సంస్థ యువకళావాహిని వ్యవస్థాపకులుగా 1998 లో పరిచయం! 2000 సంవత్సరం లో వార్త కు మారాక నా రాతలు చూసి దగ్గరయ్యారు! నాకు వృత్తి పరంగా మన తన తేడా ఉండదు! తప్పు చేస్తే విమర్శకు వెనకాడను ! అదే ఒకసారి వార్త లో వారికి వ్యతిరేకంగా రాశాను! ఆ వ్యతిరేకత ఆయన సద్విమర్శగా స్వీకరించారు! కొన్నాళ్ళకు మరింత దగ్గరయ్యారు!
2010 నుంచి ఆప్త మిత్రులయ్యాం! ఇక, నేను కళ పత్రిక పెట్టాక గౌరవం తో కూడిన స్నేహం మరింతగా పెరిగిపోయింది! ఇద్దరం కలసి అతిధులుగా వేదికలు పంచుకున్నాం! ఆయనుంటే నేను ఉండి తీరాలి! అది ఆయనకొక ఆనందం! ఏ ఊరు వెళ్లినా, ఏ కార్యక్రమం చేసినా నేను ఉండాలి! యువకళావాహిని కార్యక్రమాల్లో నేను భాగస్వామి అయిపోయాను! ఆర్ధిక సహకారం నా వంతుగా నా మిత్రుల సహకారం తో చేయించేవాడ్ని! అందులోంచి కళ పత్రిక నిర్వహణకు చేయూత లభించేది! ప్రతి సాంస్కృతిక ఆహ్వాన పత్రం లో ఇద్దరం అన్నదమ్ముల్లా ఉండాల్సిందే! సభ లో నన్ను నా కళ పత్రిక గురించి మంచిగా చెప్పేవారు ! ఆలా ఒకరికొకరం కలసి ప్రయాణించాం! ఈ నెల మూడో తేదీ నుంచి మూడు రోజులు గుంటూరు లో వున్నాం! రిటర్న్ జర్నీ లో కారు వదిలేసి సమాచార రవాణా శాఖ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో కలసి అమరావతి బస్సు లో హైదరాబాద్ వచ్చాము!
6న, 7న రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నాం! 12 న జరిగిన కార్యక్రమం లో పాల్గొనేందుకు నాకు వీలు పడలేదు,! 14 ఉదయం శోభానాయుడు జయంతి కి అయన హాజరు కాలేక పోయారు! ఆ రోజు రెండు సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాం! మధ్యాహ్నం నిద్రలో గుండె పోటు తో కనుమూశారు! వారితో ప్రయాణం ఆగింది! ఒక సాంస్కృతిక శకం ముగిసింది! ఒక నిబద్ధత నిజాయితీ గల సాంస్కృతిక యోధుడ్ని కోల్పోయాం! మంచి మనసున్న మానవతావాది నాకు దూరం అయ్యారు!
అప్పటి వరకు ఏ చిన్న సమస్య వచ్చిన వారికి చెబితే ఎంతో రిలీఫ్ చేసేసే వారు! ఆయనకు ఏ మనసు బాధ అనిపించినా నాకు చెప్పి స్వాంతన పొందేవారు ! అందుకే అయన ఇక లేరు అనే విషయం కలచి వేసింది! మూడు రోజులు నిద్ర పట్టలేదు! శ్రీ సారిపల్లి కొండలరావు గారి సహకారం తో త్యాగరాయ గానసభ లో నిన్న శనివారం ఉదయం వై కె గారి సంతాప సభ ఏర్పాటు చేశాను! ఆయనకు అత్యంత ఆత్మీయ మిత్రులందరం చేరి మనసులో భావాలు పంచుకుని కాస్త ఊరట పొందాం !
ఈ సభ లో తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ రచయిత్రి శ్రీలత, డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, శ్రీ పండిట్ అంజుబాబు, తెలుగు యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు శ్రీమతి నిర్మల ప్రభాకర్, శ్రీ జి.నెహ్రూ, న్యాయశాఖ ప్రత్యేక అధికారి శ్రీ లంక లక్ష్మి నారాయణ, ఆరాధన వ్యవస్థాపకులు శ్రీ లోకం కృష్ణయ్య, శివసాయి మానస సరోవర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బి.నాగయ్య, శ్రీ మల్లాది గోపాలకృష్ణ, కవయిత్రి శ్రీమతి మహే జబీన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి ఆమని, ప్రాగ్నిక ఆర్ట్స్ శ్రీ ప్రవీణ్ కుమార్, నివేదిత ఆర్ట్స్ శ్రీ సుభాష్, సింగర్ పవన్, సంధ్యావర్షిణి, యువ కళావాహిని సభ్యులు శ్రీ బొప్పన నరసింహారావు, శ్రీ జి.మల్లికార్జున్, శ్రీ ఎం.ఎ.హమీద్, శ్రీమతి ఉమారాణి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యులు కేసీఆర్, ఆంధ్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు సంతాప సందేశాలు పంపించారు.అమెరికా నుంచి శ్రీ రవి కొండబోలు, ఇక్కడ నుంచి పంపిన డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ కె.ధర్మారావు సంతాప సందేశాలు సభలో చదివాం! వైకె గారి చిత్రపటం శ్రీ లంకా సతీష్ పంపించారు. వెంగళాస్ క్యాటరింగ్ శ్రీ సుబ్బారెడ్డి గారు భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఘనంగా జరిగింది.
నా ఆత్మీయ మిత్రుడికి మంచి నివాళి అర్పించాం! నా మనసులో భారం కాస్త తగ్గింది. ఇంకా చాలామంది సంతాప సందేశాలు పంపినా సమయాభావం వల్ల వినిపించ లేకపోయాం! కిన్నెర రఘురాం గారు వై కె మహోన్నత వ్యక్తిత్వం గురించి కవిత్వ రూపం లో పంపించారు. వై కె గారి పేరిట అవార్డు నెలకొల్పితే, నగదు పారితోషికం తానే ప్రతి ఏటా ఇస్తానని స్వయంగా శ్రీ ఎస్.వేణు గోపాలాచారి ప్రకటించారు. కలయిక ఫౌండేషన్ శ్రీ నారాయణ గారు అమెరికా లో ఇక్కడ పది వేల రూపాయల వై కె నాగ్వశ్వరరావు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీమతి ఆమని గారు వై కె పురస్కారాలు, శ్రీ ప్రవీణ్ కుమార్ గురుప్రసాద్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఇస్తామన్నారు! శ్రీ కళా జనార్ధనమూర్తి గారు వై కె పురస్కారం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికి వై కె గారిని సజీవంగా ఉంచేందుకు అందరూ ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు! వారి గ్రామం తెనాలి దగ్గరలోని మంచికలపూడి లో వై కె విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలనీ జనాబ్ హమీద్ కోరారు! సౌజన్యమూర్తి శ్రీ సారిపల్లి కొండలరావు సహకారం తో యువకళావాహిని స్ఫూర్తి ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ సూచించారు. వై కె గారికి ఇష్టమయిన పాటలను శ్రీమతి ఆమని, శ్రీమతి భూదేవి, శ్రీ ప్రవీణ్ కుమార్, శ్రీ పవన్ పాడి నివాళి అర్పించారు! అన్నీ నేనయి సభ ను నిర్వహించి మిత్రుడు వై కె గారికి ఘన నివాళి సమర్పించడం తో నా మనో భారం కాస్త తగ్గింది. తెలుగు నేల ఉన్నంత కాలం, సాంస్కృతిక సాహిత్య రంగం ఉన్నంత కాలం వై కె గారు చిరంజీవిలా వర్ధిల్లుతారు! ఇందులో సందేహం లేదు!
✍️ రచయిత- - డాక్టర్ మహ్మద్ రఫీ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: