ముగ్గురి ప్రాణాలు కాపాడిన దిశ యాప్
- కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి (ఐపియస్)
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కుటుంబ సమస్యల కారణంగా కుమార్తెలతో కలిసి నల్లమల అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే మహానంది పోలీసులు స్పందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి కాపాడిన పోలీసులు. మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది. మొబైల్ లో ఉన్న దిశ యాప్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళిన ఒక సందేశంతో కర్నూలు జిల్లా మహానంది పోలీసులు సత్వరమే స్పందించి బాధితులను రక్షించారు. మహానంది ఎస్ఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి , తన కుమార్తెలు సుప్రియ (7), చరిత(5) , యామిని (3)లతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులోని నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన ఆదిలక్ష్మి ముందుగా విషపూరిత ద్రావణాన్ని ( సూపర్ వాస్మోల్ ) సేవించి, ఈ తర్వాత సుప్రియ, చరితలకు తాగించింది. ఆ తరువాత పిల్లలు చనిపోతారని భయపడి మొబైల్ ఉన్న దిశ యాప్ ద్వారా కర్నూలు పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం పంపింది. కాల్ సెంటర్ సిబ్బంది వెంటనే మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డికి సమాచారమిచ్చారు. ఎస్సై సత్వరమే రోడ్ సేఫ్టీ సిబ్బంది నూర్ భాషాకు తెలియజేశారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లి, కుమార్తెలను అదే వాహనంలో గాజులపల్లెకు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డల పరిస్ధితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆదిలక్ష్మీ భర్త ప్రసాద్ ఏడాది క్రితం వాగులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సంఘటన తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ శనివారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన కుటుంబాన్ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్ధితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆర్ధిక పరిస్ధితులు బాగాలేనందున జిల్లా ఎస్పీ 50 వేలు ఆర్ధికసాయం అందించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్ సమావేశంలో ఈ విషయంపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా దిశా యాప్ ను డౌన్ చేసుకోవాలన్నారు. వారి రక్షణకు కవచంగా వాడుకోవాలన్నారు. మహిళలకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు దిశా యాప్ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల రక్షణకు దిశా మహిళ పోలీసులు, దిశా పెట్రోలింగ్ వాహనాలు, దిశా మిని బస్సు మీ చెంతకే వచ్చి మీ సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తాయన్నారు. దిశా యాప్ కు సమాచారం అందించినప్పడు సత్వరమే స్పందించిన మహనంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డిని, రోడ్ సెఫ్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి, నంద్యాల పట్టణ సిఐలు, తాలుకా సిఐలు ఉన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: