వరాల తహజ్జుద్ నమాజ్ ను...

చేజార్చుకొంటే ఎలా..?

ఫజర్ నమాజుకు గంట ముందు ఏం జరుగుతుందో తెలుసా..?

వరాల మాసం...పుణ్యఫలాలు అందించే మాసం రంజాన్ నెల. నమాజ్ ప్రతి ముస్లిం జీవితంలో ఎంతో కీలకం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రంజాన్ మాసంలో జరిగే ప్రతి ఆరాధనకు ఎన్నో రెట్ల పుణ్యముంటుంది. ఇక తహజ్జుద్ నమాజ్ ప్రత్యేకత గురించి ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవాలి.

అర్థరాత్రి దాటాక రాత్రి చివరి ఘడియ మొదలైనప్పుడు ఈ విశ్వంలో ఒక వింతైన మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏమై ఉంటుందనే కదా మీ ఆత్రుత. భూమ్యాకాశాల సృష్టికర్త ఏడు ఆకాశాలపైనున్న అల్లాహ్ తన సింహాసనంతోపాటు ఈ భూమిమీదకు దిగి వస్తాడు. అంటే మానవ ప్రపంచంపై అడుగుపెడతాడు. అయితే అల్లాహ్  ఎలా ఉంటాడు, మనిషి ఊహకందని విషయం. అయితే  ఆ సమయంలో అల్లాహ్ ఒక ప్రకటన చేస్తాడు. ‘వేడుకునే వారెవరైనా ఉన్నారా? నేను వాళ్ల విన్నపాలను స్వీకరిస్తాను’ అని ప్రకటిస్తాడు. ‘ఎవరికేం కావాలో వచ్చి అడగండి వారి కోరికలు తీరుస్తాను’ అని చక్రవర్తి, మంత్రి గానీ చాటింపు వేస్తే ప్రజలు తమ కోరికలు తీర్చుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తారు. మన దరఖాస్తులను రద్దు చేయని, మన విన్నపాన్ని నెరవేర్చే ఆ మహా చక్రవర్తి, భూమి, ఆకాశాల సృష్టికర్త స్వయంగా వచ్చి అడుగుతున్నాడు. మరి మన అభ్యర్థనల్ని, మన విన్నపాల్ని విన్నవించుకునే సమయం మనదగ్గర లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కరోనా మహమ్మారి వెంటాడుతోంది. అయినవారెంతోమంది ఈ మహమ్మారికి బలవుతున్నారు.

మరెంతోమంది ఈ పాండమిక్ తో ఉపాధి కోల్పోతున్నారు. అంటువ్యాధి నిద్రలేకుండా చేస్తోంది. దారిద్ర్యంలోకి నెట్టేస్తోంది. ఆరోగ్యమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, సంతాన లేమి సమస్యలైనా, ఇలా సమస్య ఏదైనా ఫజర్ నమాజుకు గంట సమయం ముందుగా లేచి నమాజులో లీనమవ్వండి. ఈ వేళలో చేసే నమాజును తహజ్జుద్ నమాజు అంటారు. పూర్తి ఏకాగ్రతతో తహజ్జుద్ నమాజు, ఆ తరువాత ఖుర్ఆన్ పారాయణం చేయండి. మీకు వచ్చిన ఖుర్ఆన్ లోని కొంత భాగాన్ని శ్రద్ధగా చదవండి.  ఆ తరువాత చేతులెత్తి మీ సమస్యలను అల్లాహ్ ముందు మీ భాషలోనే ఏకరువు పెట్టండి. ఇలా చేయడం వల్ల అల్లాహ్ తో సాన్నిహిత్యం పెరుగుతుంది. రమజాన్ నెలలో తహజ్జుద్ నమాజ్ చేయడం మరింత సులభతరం. సహెరీ భుజించడానికి అరగంట ముందు మీ నిద్రను త్యాగం చేస్తే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే తహజ్జుద్ నమాజు చేయండి. 

✍️ రచయిత- ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: