సాహిత్య శిఖరం నేలకొరిగింది
ఆలేరు ఆణిముత్యం తిరునగరి ఇకలేరు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
ఆలేరు ఆణిముత్యం, ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత కవితిలక డా.తిరునగరి (75) స్వర్గస్తులయ్యారు. కొన్ని రోజులక్రితం అనారోగ్యంతో హైదరాబాద్ కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి తెలుగు పాఠం చెప్తుంటే మనసు తిప్పుకోనీయని వాచికం, వింటే చాలు పాఠం అట్లా గుర్తుండిపోయేంత చక్కని బోధన. తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషల్లో పారీణత కలవాడు. పద్యం, గద్యం, వచన కవిత్వంలో అందే వేసిన చెయ్యి ఆయనది. అద్భుతమైన ధారణాశక్తి. 4గం.ల రాత్రికే లేచి పద్యాలు పాడుతూ పనులు చేసుకునేవాడు. వందల గ్రంథాల నుంచి కోటేషన్లనిస్తూ ఉపన్యాసాలివ్వడంలో తనను మించినవారు లేరు. గొప్పవక్త. ఎందరికో కవితారచనలో దారిచూపి కవితామార్గదర్శకుడయ్యాడు.
సాహిత్యసమీక్షలో అందెవేసిన చెయ్యి. అందరిని ప్రోత్సహించే మనస్తత్వం ఆయనది. 30 కవితాసంకలనాలు, వందలకొద్ది సాహిత్యవ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు...ఎన్ని రచనలు చేసినాడో సార్. తనకు పరిచయమైన వారందరికి మొన్నటి కార్డురాయడం తనకలవాటు. అంతచిన్న కార్డులో ఎన్ని విషయాలో రాసేవాడు. దాచుకునే మెమోరీలు. గతకొద్ది రోజుల నుంచి అనారోగ్యం వున్నాడని తెలుస్తూనే వుంది. హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొస్తాడనుకునే సమయంలో ఇట్లా కుటుంబాన్ని, ఎందరో తన విద్యార్థులను వదిలేసి తనదారిన వెళ్ళిపోయాడు సార్. తిరునగరి గారి మరణం పట్ల ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి, ఎస్. హరగోపాల్, డా. లింగంపల్లి రామచంద్ర, డా. పోరెడ్డి రంగయ్య, సి.వి. శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బోట్లపరమేశ్వర్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ప్రధానాచార్యులు బండి రాజుల శంకర్, జలాల్ మజీద్, మాయ ఆనంద్ కుమార్, మొరిగాడి ఉపేందర్, తునికి విజయసాగర్, రాంచందర్ గౌడ్, బందెల సుభాష్ తదితరులు తమ సానుభూతిని తెలియజేశారు. తెలుగు సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిన సుప్రసిద్ధ సాహితీ వేత్త డాక్టర్ తిరునగరి సార్ మరణం సాహిత్య లోకానికి తీరని లోటు. ముఖ్యంగా ఆలేరు ప్రాంతానికి సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనత సార్ కు దక్కుతుంది..వందలాది, వేలాది మంది శిష్యులను సాహిత్యాభిమానులు గా తీర్చిదిద్దారు. ఆయన నడిచే గ్రం థాలయం. గొప్ప పండితుడు.వేలాది పద్యాలు కంఠోపాఠం. ఏ విషయం అయినా ఇట్టే చెప్పే బహుముఖ ప్రజ్ఞాశాలి. సార్ మరణం బాధను కలిగిస్తుంది.. సాహిత్య రంగం పెద్ద దిక్కును కోల్పోయింది...వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని వారు పేర్కొన్నారు.
1984-85 బ్యాచ్ విద్యార్థుల దిగ్భ్రాంతి
'' ఇంతటి విషాదవార్త మా మనసులను కలచివేసింది.మాటలు రావడం లేదు. సార్ కుటుంబంతో మాకు విడదీయరాని అనుబంధం. బాల్యంలో పాఠశాలలో మా తెలుగు ఉపాధ్యాయునిగా తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని కల్గించే విధంగా ఎన్నో కథలు పద్యాలు పురాణాలను మనసుకు హత్తుకునే విధంగా ఆసక్తికరంగా బోధించి తెలుగు సాహిత్యం పట్ల ఆకర్షణ కలిగించాడు. సార్ శిష్యులు కావడం మేమెంతో గర్వించే విషయం. ఉపాధ్యాయునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే ప్రముఖ కవిగా పేరు గడించి అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. వారు ఏ సభలో ఉంటే ఆ సభకే నిండుదనం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణం. ఎక్కడ కనబడ్డ ఎంతో ఆప్యాయంగా ప్రేమతో పేరుపెట్టి పిలిచి మా కుటుంబ బాగోగులు కూడా అడిగే సార్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
ఆలేరు, యాదాద్రి జిల్లా పేర్లను సాహితీ వినీలాకాశంలో ఊరేగించిన సారుకు ఈ ప్రాంతవాసులుగా అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.దాశరథి గారన్నట్టు కవి వేగుచుక్క లాంటివాడు.అక్షరం ఉన్నన్ని రోజులు ప్రజల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాడు. సార్ పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.... వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తన కుమారుడు, మా బాల్య స్నేహితుడు తిరునగరి శ్రీనివాస్ కు
ఈ సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను'' అని జిల్లా ప్రజాపరిషత్ 1984-85 బ్యాచ్ కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్, పద్మలత, సయ్యద్ అక్రమ్ ఘోరీ, మహమ్మద్ సిరాజ్, రాంబాబు, ఉప్పలయ్య, మొరిగాడి శ్రీనివాసగౌడ్, నాగేందర్, బజ్జూరి రవీందర్, మిట్టపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి ఆంజనేయులు, నాసర్ షరీఫ్, సముద్రాల శివకుమార్, చిట్టిమల్ల భాస్కర్, అంజిరెడ్డి, పడిగెల రాజేశ్వర్, చొల్లేటి భూషణం తదితరులు సార్ మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: