మన దేశ ఎన్నికలు ఎంతో ఖరీదు

అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇక కలేనా

అంబేద్కర్ స్పూర్తికి భిన్నంగా ఓటు హక్కు వినియోగం

డబ్బు సంచులకు రాలుతున్న ఓట్లు

సంపన్నుల క్రీడగా మన ఎన్నికలు

సంస్కరణలతోనే గాడిన పడనున్న ఎన్నికల వ్యవస్థ



ఓటు అనే ఆయుధంతో ఎవరైనా పాలకుడు కావచ్చు. ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఏమైన కావచ్చు. అది పేదవాడైనా...ధనికుడైనా. ఈ ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్.అంబేద్కర్ దేశ పౌరులందరికీ ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, తమలోని ఒకడిని పాలకుడిగా చేసుకోవడానికి అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారు.కాలం మారుతోంది. కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి. వాటికి రాజకీయాలు మినహాయింపుకాదని తేలిపోయింది. మన ఓటు మన ప్రభుత్వం అన్న రాజకీయాలు కాస్త ఇపుడు రూపుమార్చుకొన్నాయి. మీ డబ్బు..మా ఓటు అన్న పరిస్థితి దాపురించింది. ఓట్లు కొన్నా కాబట్టి పాలన నా సొంతం మీకు కోసం కాదు అన్నట్లుగా ఎన్నికల్లో గెలిచిన వారితీరువుంది.

రాజ్యాధికారం...అట్టడుగు వర్గాల వారికి దూరమే

మన దేశంలో ఎన్నికలంటే ఒక పండుగ..దేశంలో ఎక్కడో ఓ చోట లేదా ఏదో ఓ రాష్ర్టంలో ఎన్నికలు జరగడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆందోళన కలిగించే అంశాలు చాలా ఉన్నాయ. అట్టడుగు వర్గాలు సైతం చట్టసభల్లో అడుగుపెట్టేలా ఓటు హక్కు దోహదపడుతుంది. కానీ నేడున్న పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఏస్పూర్తితో అంబేద్కర్ దేశంలోని పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారో ఆ ఉద్దేశం నేడు పక్కదారి పడుతోంది. దీనికి కారణం స్వయంగా ఓటరే. కానీ తాత్కాలిక ప్రయోజాల కోసం తన భవిష్యత్తును తానే కాలరాసుకొంటున్నాడు అన్నది మాత్రం ఓటర్లు విస్మరిస్తున్నారు. పరిస్థితి నేడు ఎలా తయారైందంటే అట్టడుగు వర్గాలు, పేద వర్గాల తమ తలరాత మార్చేందుకు తమలోని ఒకరిని చట్టసభలకు పంపించలేని పరిస్థితి వచ్చింది. ధనికుడు, డబ్బున్న వారికే పోటీ చేసే అర్హతను స్వయంగా ఓటర్లే నిర్ణయించారు. తద్వారా తాను పాలింపబడే హక్కును నేటి ఓటర్లు శాశ్వతం చేసుకొంటున్నాడు. తాను స్వయంగా పాలకుడిగా ఎదిగే అవకాశాలకు సమాధికడుతున్నాడు.

ఇక మనదేశంలో సాధారణ ఎన్నికల గణాంకాలను ఒక సారి చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 1952లో నిర్వహించిన సాధారణ ఎన్నికలు ప్రభుత్వ ఖజానాపై కేవలం రూ.10.5 కోట్ల భారం పడింది. అదే 2019 సాధారణ ఎన్నికల విషయానికి వస్తే రూ.10వేల కోట్లకు చేరింది. గతంలో ప్రజలు ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి నిజాయితీ పరుడా లేదా అని ఆలోచించి ఓటు వేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పెద్ద మొత్తంలో డబ్బు లేదా ఖరీదైన బహుమానాలు ఇచ్చినా ఓట్లు పడతాయని గ్యారంటీ లేదు.  తాజా సీఎంఎస్‌ విడుదల చేసిన నివేదికను బట్టి చూస్తే అన్నీ రాజకీయ పార్టీలు 2019 ఎన్నికల్లో సుమారు 60వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చే చేశాయని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. ఎంత పెద్ద మొత్తంలో డబ్బు వృధా అయ్యిందో దీన్ని బట్టి చూస్తే అర్దం అవుతోంది. పోటీ చేయడానికి అభ్యర్థికి గరిష్ఠంగా 70 లక్షలు మాత్రమే ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తోంది. సీఎంఎస్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే రూ.20 నుంచి రూ.25వేల కోట్ల వరకు అభ్యర్థులు ప్రచారం కోసం ఖర్చు చేస్తే.. రూ.12వేల నుంచి 15వేల కోట్ల వరకు నేరుగా ఓటర్లకు డబ్బు పంచిపెట్టారని పేర్కొంది. ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బు, మద్యం, నగలు తదితర విలువైన వస్తువుల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్‌ పట్టుబడ్డ నగదు తదితర అంశాల గురించి వెల్లడించింది. 2019 ఎన్నికల్లో మొత్తం రూ.3,500 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోగా.. వాటిలో రూ.1,300 కోట్లు మాదక ద్రవ్యాలు,  రూ.839 కోట్ల నగదు, రూ.294 కోట్ల మద్యం,  రూ.986 కోట్ల బంగారం, వెండితో పాటు ఇతర విలువైన వస్తువులు రూ.58 కోట్ల వరకు  స్వాధీనం చేసుకుంది. మన నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు చేసిన సొమ్ము ఇది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అభ్యర్థులందరూ కోటీశ్వరులే:

2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల చరిత్ర తెలుసుకుంటే అభ్యర్థులు ఎంత సంపన్నులో తెలిసిపోతుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన 363 మంది అభ్యర్థులు కోటీశ్వరులు, అటు తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన 349 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. అలాగే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, ఎస్‌ఏడి, ఏఐఏడీఎంకె అభ్యర్థులంతా కోటీశ్వరులే. దేశంలోని అత్యంత సంపన్నులు దేశంలోని అత్యంత పేద ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే అభ్యర్థుల నేరస్తుల చిట్టా కూడా పెద్దదే. డబ్బుతో  పాటు కండబలం అదనపు క్వాలిఫికేషన్‌. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన సర్వేలో 88 శాతం మంది ఎంపీ ఆస్తుల రూ. ఒక కోటీ కంటే ఎక్కువగా ఉన్నాయని, దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని తేటతెల్లం చేసింది. 2014 లోకసభతో పోల్చుకుంటే నేరస్తుల సంఖ్య 26 శాతం పెరిగింది. అలాగే 124 మంది ఎంపీలు అంటే 24 శాతం మంది నాన్‌ గ్రాడ్యుయేట్లు. ఒక ఎంపీ మాత్రం తాను నిర్లక్ష్యరాస్యుడినని తనకు తాను ప్రకటించుకున్నారు. మరో ఎంపీ తనకు చదవను రాయడం రాదని చెప్పుకున్నారు.   

పార్టీలు మారడం సాధారణం:

ఇవన్నీ ఒక ఎత్తయితే చాలా రాష్ర్టాల్లో ఎన్నికలకు ముందు పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది. అధికారంలోకి తమ పార్టీ రాదనుకుంటే రాత్రికి రాత్రే కండువాలు మారిపోతాయి. దీనికంతటికి అధికార కాంక్ష అని చెప్పుకోవచ్చు.  కొన్ని రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున పార్టీలు మారడం స్థానిక ప్రభుత్వాలు కుప్పకూలిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు పూర్తిగా అవినీతిమయం అయిపోయాయి. రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు పాపం! వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వనరులు సమకూర్చుకోవాల్సి వస్తోంది. అధికారంలోకి లేకుంటే ఒక్క క్షణం కూడా వీరుండలేరు కదా!

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో  వ్యక్తిగత దాడులకు దిగడం, బెదిరించడం సర్వసాధారణం అయిపోయాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఎన్నికల ప్రచారం మామూలు అయిపోయాయి.  వాస్తవానికి ఎన్నికలు వాస్తవాలపై పోరాడాలి కానీ, తాము అధికారంలోకి వస్తే అన్ని ఉచితంగా ఇస్తామంటూ ఆకర్షించడం, ఆకర్షణీయమైన పదజాలంతో ఆకట్టుకోవడం ప్రస్తుతం జరగుతున్న ఎన్నికల్లో చూస్తున్నాం. ప్రస్తుతం పోటీ చేస్తున్న అతి పెద్ద పార్టీలు మాత్రం సుపరిపాలన అందిస్తామన్న మాట మచ్చుకైనా కనిపించదు. అన్నీ పార్టీలు తాయిలాలు అందిస్తామని హామీల వర్షం గుప్పిస్తున్నాయి.  ఒకదానితో ఒకటి  పోటీపడి తాయిలాలు ప్రకటించేశాయి. బెంగాల్‌ ఎన్నికల ప్రచారం మాత్రం మరింత హద్దు మీరిపోయింది.

ఎన్నికల సంస్కరణలే దిక్కు:

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరమని తెలుస్తోంది.అయితే అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని పక్కన పెడుతోంది. ఉదాహరణకు సుప్రీంకోర్టు  నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను పోటీ చేయరాదని పలుమార్లు ప్రయత్నించి విఫలమైంది. మన భారత పార్లమెంటు దీనిపై పెద్ద శ్రద్ధచూపించలేదు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి సెలెబ్రిటి లిల్లీ థామస్‌  కేసులో నిందితుడైన శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు.  అయితే ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టేసింది. అటు తర్వాత 2014లో సుప్రీంకోర్టు  ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాదిలోగా పూర్తి చేయాలని రూలింగ్‌ ఇచ్చింది.  శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక కోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అలాగే 2018లో అన్నీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులు ప్రచురించాలని ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఈ అంశంలోను సుప్రీంకోర్టు మాట నెగ్గలేదు.  సెప్టెంబర్‌ 2020లో సుప్రీంకోర్టుకు అండగా పనిచేస్తున్న అమిస్‌ క్యురి ఒక నివేదికలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులో మొత్తం 4,442 కేసులు ఎంపీ, ఎమ్మెలపై కొనసాగుతున్నయని పేర్కొంది. 

                     చాలా కేసులు పలు కోర్టుల్లో నత్తనడకన కొనసాగుతున్నాయి. అత్యంత పాత కేసు విషయానికి వస్తే 1983లో స్పెషల్‌ కోర్టులో ఇంకా కేసు కొనసాగుతోంది.  అలాగే 1991, 1993, 1994లో రిజిస్టర్‌ అయిన మూడు కేసులు ఇప్పటి వరకు ట్రయల్‌కోర్టుకు కూడా రాలేకపోయాయి.  ఇప్పటి వరకు ప్రత్యేక కోర్టుల్లో శిక్షపడిన దాఖలాల్లేవు. ఉదాహరణకు తెలంగాణలో 245 కేసులుంటే  73 కేసుల్లో ఎలాంటి శిక్షలు పడకుండా కేసులు కొట్టివేయడం జరిగింది. మిగిలిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఎన్నికల్లో పారదర్శకత ముఖ్యం:

ఎన్నికల ఫండింగ్‌ పారదర్శకత ముఖ్యం. అన్ని పార్టీలు తమకు ఫండింగ్‌ విషయం తమ పార్టీ వెబ్‌సైట్‌ పెట్టాలి. కానీ రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని పట్టించుకోవు. ఏడీఆర్‌ అధ్యయనం ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన నాయకుల ఆదాయం వెల్లడించిన దాఖలాల్లేవు. ఎవరో కొంత మంది తప్పితే చాలా మంది ముఖం చాటేశారు. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ పార్టీలు అక్రమంగా విదేశాల నుంచి డొనేషన్లు స్వీకరిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టు గుర్తించింది. విదేశీమారక చట్టం కింద కింది హైకోర్టు తీర్పును అమలు కాకుండా అడ్డుకున్నాయి ఈ రెండు పార్టీలు. ఎలక్టోరల్‌ బాండ్లను  తీసుకురావలనుకుంటే వారికి చట్టపరమైన అడ్డంకులు వచ్చిపడ్డాయి. కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే డొనేషన్లే తమ బ్యాలెన్స్‌ షీట్లలో చూపించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎలక్షన్‌ కమిషన్‌లు కూడా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మనీ లాండరింగ్‌ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ అన్నీ రాజకీయ పార్టీలు ప్రజాలకు సేవ చేసే సంస్థలు కాబట్టి సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందవచ్చు అని సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ నిర్ణయిస్తే.. ఈ అంశాన్ని సుప్రీకోర్టు తీసుకువెళ్లాయి.గత ఎనిమిదేళ్ల నుంచి ఈ అంశం కోర్టులో నలుగుతోంది. మొత్తానికి మన దేశంలో ఎన్నికలు అంటే అదో ప్రహాసనంగా మారిపోయాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: