ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ కమిటీ సమావేశం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' నిర్వహించబోతున్న సందర్భంగా తెలంగాణలో ఉత్సవాలు ఘనంగా జరపాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గారి ఆదేశాల మేరకు 2021, మార్చి 10న రవీంద్ర భారతి కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం జరిగింది. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహోత్సవాల నిర్వాహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ ప్రణాళికను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కమిటీ, ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిపే ఈ ఉత్సవాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా వివిధ స్థాయిల్లో ఫ్రీడం రన్, కవి సమ్మేళనాలు, వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలతోపాటు ఇతర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే విషయమై చర్చించింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలన్నింటితో ఒక నివేదికను తయారుచేసి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గారికి అందజేస్తామని, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేవీ రమణాచారి గారు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, సందీప్ సుల్తానియా మరియు సాంస్కృతికశాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ‌ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: