మూడు ఒకేనా...ఒకటికే జై కొడతారా

బెజవాడ తీర్పు...ఆ విధాన నిర్ణయాలకు జీవం

గుంటూరు తీర్పు కూడా కీలకమే

పార్టీల విజయావకాశాలపై ఉత్కంఠ

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకి వరంగా మారుతుంది. కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న స్తానిక సంస్థల ఎన్నికలు అదులోనూ విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తీర్పు మాత్రం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రచారంలో మూడు రాజధానులకు జై కొడతారా లేక టీడీపీకి ఓటేసి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా అన్నది మీ చేతుల్లో ఉందని ఓటర్లను ఆయన విన్నవించుకొన్నారు. దీంతో ప్రస్తుతం విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తీర్పు కీలకంగా మారింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మూడు రాజధానుల నిర్ణయం విషయంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేకతనుంచి బయటపడటమే కాకుండా ఆ పార్టీ పథకాలకు ప్రజలు జై కొట్టారు అని స్పష్టంగా తెలుస్తుంది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా కీలకమే. అలా కాకుండా ఈ రెండు కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఫలితాలు అనుకూలంగా వస్తే మూడు రాజధానులకు ప్రజా నిర్ణయం వ్యతిరేకం అన్న అస్త్రం టీడీపీ చేతికి బలంగా అందొస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తీర్పు ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి.

విజయవాడ నగరపాలక సంస్థలో పోలింగ్‌ శాతం భారీగా తగ్గడంతో విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. విజయవాడ నగరపాలక సంస్థలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్‌ శాతాన్ని బట్టి తమకే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. టీడీపీ, వైసీపీలకు సమానంగా కార్పొరేటర్‌ స్థానాలు వస్తే మేయరు ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ ఇంకా మేయర్‌ అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం 64 డివిజన్లలో పోటీ చేసింది. సీపీఐతో పొత్తు కుదుర్చుకుని టీడీపీ 56 స్థానాల్లో పోటీ చేసింది. ఒక స్థానంలో జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఏడు స్థానాల్లో సీపీఐ పోటీ చేసింది. టీడీపీ వర్గాల అంచనా ప్రకారం నగరంలో 35 నుంచి 40 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. వైసీపీ నేతలు తాము 40 నుంచి 45 స్థానాలు గెలుస్తున్నామని ప్రకటించారు. రాజకీయ పార్టీల విశ్లేషకులు మాత్రం టీడీపీ గట్టిపోటీ ఇచ్చిందని, సమానంగా విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయని, ముందు జాగ్రత్తగా నమోదుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

టీడీపీకే ఎక్కువ..!

విజయవాడ నగరపాలక సంస్థలో ఎక్స్‌ అఫీషియో ఓట్లు టీడీపీకు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉన్నాయి. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు నగర పరిధిలో ఉన్నారు. వీరు కాకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు నగరంలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ ఇక్కడ ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం 71 ఓట్లు ఉన్నట్లు లెక్క. వీటిలో మాజిక్‌ ఫిగర్‌ అంటే.. సగానికి ఒకటి ఎక్కవ ఉండాలి. 36 ఓట్లు వచ్చిన వారు మేయర్‌గా విజయం సాధిస్తారు. ఈ నెల 14న ఈ లెక్క తేలుతుంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేనినాని, తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్‌, రాజ్య సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న,

మరో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుల ఓట్లు తెదేపాకు వచ్చినట్లే. మరో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉయ్యూరుకు ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అవసరమైతే ఉయ్యూరుకు కాకుండా విజయవాడ కార్పొరేషన్‌కు ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పరిశీలన చేస్తున్నాయి. దీంతో మొత్తం 6 ఓట్లు వచ్చినట్లే. అంటే ఇంకా 30 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే మేయర్‌ పీఠం దక్కుతుంది. వైసీపీకు పశ్చిమ, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అంటే 34 డివిజన్లలో విజయం సాధిస్తేనే మేయర్‌ పీఠం దక్కుతుంది. పోలింగ్‌ శాతం 58.05గా నమోదైంది. దీని ప్రభావం ఎలా ఉంటుందోనని పార్టీలు అంచనా వేస్తున్నాయి. 14న భవితవ్యం తేలనుంది.

జనసేన ప్రభావం..?

విజయవాడ నగరంలో జనసేన ప్రభావంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. పలు డివిజన్లలో జనసేన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన 40 డివిజన్లలో పోటీ చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ 22 డివిజన్లలో పోటీ చేసింది. ఒక డివిజన్‌లో జనసేనకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఒకటో పట్టణంలో స్పష్టమైన ప్రభావం చూపినట్లు ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గెలిచే స్థాయిలో లేకపోయినా విజయావకాశాలు తారుమారు అయ్యే స్థితిలో ఉన్నట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కనీసం 10 స్థానాల్లో తప్పక విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు ఎవరి ఓట్లు చీల్చారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చితే టీడీపీకు నష్టం జరిగే అవకాశం ఉందని కొంతమంది, గతంలో వైసీపీ ఓట్లు జనసేనకు వెళ్లాయని మరికొంతమంది అంచనా వేస్తున్నారు. కమ్యూనిస్టులు కూడా కొన్నిచోట్ల ప్రభావం చూపిస్తారు. నాలుగైదు వార్డుల్లో బీజేపీ ప్రభావం ఉందని చెబుతున్నారు. మొత్తానికి విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: