బోయకులస్తుల మధ్య గొడవైతే.. రెడ్లేందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు

ఇక్కడ స్పష్టంగా కలెక్టర్ పై కుట్ర జరుగుతోందని చెప్పవచ్చు

ఆంధ్ర బహుజన ప్రజావేదిక

(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" తీవ్రంగా ఖండించింది. బుధవారంనాడు అనంతపురం జిల్లా, కదిరిలో మహాత్మా జోతిరావు పూలే విగ్రహం వద్ద "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుగారిపై కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గంధం చంద్రుడుపై సభ్యసమాజం హర్షించని విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నార అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... వీటిని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యమంత్రి గవర్నరు గారు, స్పీకర్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

 ఎందుకంటే ధర్మవరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ని ‘‘ఇగోయిస్టిక్, పనికిమాలిన వ్యక్తి, హనీట్రాప్‌, పక్కనోళ్లు చేసిన పనిని నీ క్రెడిట్‌లో వేసుకుంటావు..’’ అంటూ వ్యక్తిగతంగా దూషించిన వైనం సభ్యసమాజం తల దించుకొనే విధంగా చేసింది. వాస్తవానికి, జరిగిన వివాదం గురించి తక్కువగా మాట్లాడి.. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కలెక్టర్ గంధం చంద్రుడు ఇటీవలే అనంతపురం జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు సాధించిపెట్టి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నా, ఆ ఘనతను సైతం చులకన చేస్తూ.. పక్కనోళ్లు చేసిన పనికి గంధం చంద్రుడు క్రెడిట్ కొట్టేశారంటూ ఎమ్మెల్యే అసందర్భంగా మాట్లాడటం చూస్తే కలెక్టర్‌ దళితుడనే కక్ష సాధించడం, ద్వేషం ప్రదర్శించడమనేది స్పష్టమవుతోంది. ఒక జిల్లా కలెక్టర్‌ పై ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంత దారుణంగా దూషణలకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నాము. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ప్రశ్నించింది. అసలు వివాదానికి ఉన్న కారణం ఇదేనంటూ వారు కింది విధంగా పేర్కొన్నారు.

అసలు వివాదం ఏంటంటే..!

             శివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలపై వివాదం నెలకొడమే ఈ మొత్తం దుమారానికి కారణం! అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చిల్లావారిపల్లె నుంచి గుర్రాలు తీసుకొచ్చి అగ్నిగుండంలోకి తీసుకెళ్లి.. మళ్లీ గ్రామంలోకి తీసుకొస్తారు. ఇది అక్కడి ఆచారం.  అయితే, ఈ గుర్రాలు తీసుకొచ్చే దానిపై కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని అంకేనిపల్లి, చిల్లావారిపల్లె గ్రామాలకు చెందిన వారి మధ్య దశాబ్ధాలుగా వివాదం ఉంది. ఈ రెండు గ్రామాలకు చెందిన బోయ కులస్తుల మధ్యే ఈ ఆధిపత్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పినదాని ప్రకారం.. గొడవలు ఏ స్థాయిలో జరుగుతాయంటే వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి వరకు చిల్లావారిపల్లెకు వచ్చి గొడవలు చల్లార్చేవారు. ఈ వివాదం గత టీడీపీ ప్రభుత్వంలో మరింత ముదిరిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెబుతున్నారు.

               ఈ క్రమంలోనే చిల్లావారిపల్లె, అంకేనిపల్లి గ్రామాల మధ్య 12.2.2021 శుక్రవారం జరిగిన ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో ఊరేగింపు విషయమై రెండు గ్రామాల మధ్య గొడవలు చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తే హింస చెలరేగే అవకాశం ఉందని, ఉత్సవ విగ్రహాలు ఊరేగించవద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ, గ్రామంలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మొదలు పెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్వామి వారి ఊరేగింపు చేయరాదంటూ అడ్డుకున్నారు. ఊరేగింపు సమయానికి అక్కడికి చేరుకున్న డీసీఎంఎస్‌ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు అశ్వత్థ, భాస్కర్‌రెడ్డి.. గ్రామస్థులకు నచ్చజెప్పి పంపేశారు. అయితే, గుడి తలుపులు మూసేయడంతో మనస్తాపానికి గురైన ఆలయ పూజారి సోదరుడు రామేశ్వరరెడ్డి, ధర్మకర్త సోదరుడు బాలిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగిన వారిని మొదట నార్పలకు, అక్కడి నుంచి అనంతపురం వైద్యశాలకు తరలించారు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఆశ్రయించగా.. ఆయన 13.3.2021శనివారం ఆస్పత్రికి చేరుకుని బాలిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడుపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న ఉత్సవాన్ని కలెక్టర్ చంద్రుడు సిగ్గుమాలిన చర్య వల్ల ఆగిపోయిందని, అందుకు చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఆలయంపై కొంత కాలంగా రెడ్లు తమ ఆధిపత్యమే ఉండాలని

               అయితే, కలెక్టర్ గంధం చంద్రుడుగారిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి నోటిదురుసుపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆలయ ధర్మకర్తల విషయంలో కూడా ఎన్నో ఏళ్లుగా వివాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. చిల్లావారిపల్లెలోని ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. బీసీలైన బోయలు, కురుమలు, ఎస్సీలు, హరిజన మాల కులాలకు చెందిన వారు.. వందల సంవత్సరాల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీలు.. అన్న, మామ అనుకుంటూ బంధువులు కంటె ఎక్కువగా ఉంటారు. అయితే, ఈ దేవస్థానానికి మేమే ధర్మకర్తలమని ఇప్పుడు గత కొంత కాలంగా ‘రెడ్డి’ కులస్తులు చెప్పుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఆధిపత్య పోరు చెలరేగిందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యవహారంపై గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు కూడా చేస్తున్నామని.. దీనిపై గతేడాది కలెక్టర్ గంధం చంద్రుడు గారికి కూడా ఫిర్యాదు చేసినట్లు వివరిస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టుకు కూడా వెళ్లగా, పూజా కార్యక్రమాలు మునుపటిలాగే జరుపుకోవాలంటూ, తమకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని బోయ కులస్తులు వివరిస్తున్నారు.

రెడ్లు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశారు?

             ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకుంటే.. వివాదం మొత్తం చిల్లావారిపల్లె, అంకేనిపల్లి గ్రామాలకు చెందిన ‘బోయ’ కులస్తుల మధ్య జరిగితే.. ‘రెడ్డి’ కులానికి చెందిన వ్యక్తులు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే గార్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. నిజంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిగారికి ధైర్యం ఉంటే.. వారి ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఆస్పత్రి రిపోర్టులు బయటపెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాన్ని, పక్కదోవ పట్టించేందుకు ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నారని అనుమానం కలుగుతావుంది. వాస్తవానికి, గొడవల వల్ల మనస్తాపంతో బోయ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడాల్సి ఉంటుంది. కానీ రెడ్లు ఎందుకు ఇలా చేశారని అడుగుతున్నాము. దీన్ని బట్టి చూసుకుంటే.. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ గంధం చంద్రుడుగారిపై కుట్ర చేశారని అర్థమవుతోందని తెలియచేస్తున్నాం.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఎందుకు పరిష్కరించలేదు

                 ఈ రెండు గ్రామాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా గొడవలు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా ముందుగానే ఎందుకు సామరస్యంగా పరిష్కరించలేదని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. శుక్రవారం రాత్రి రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎందుకు చొరవతీసుకొని పరిష్కరించలేదని నిలదీస్తున్నాం. ఈ గొడవలకు సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉత్సవం ప్రశాంతంగా జరగాలని ఉత్తర్వులు జారీ చేశారని.. దాన్నే కలెక్టర్ గారు అమలు పరిచారని గ్రామస్తులు వివరిస్తున్నారు. మరి అలాంటప్పుడు కలెక్టర్ చంద్రుడు గార్ని టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నాం.

కలెక్టర్ ముందు ఎమ్మెల్యే పప్పులు ఉడకవనే

               తన అగ్రకుల అహంకారంతోనే కలెక్టర్ గారిపై పక్కా కుట్ర ప్రకారమే దాడి జరుగుతోంది. కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా ఇప్పుడు కలెక్టర్‌ని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాల బాధాకరం. వాస్తవానికి.. ఎల్లమ్మ, పెద్దమ్మ వంటి గ్రామ దేవతల ఉత్సవాల సమయంలో ఉరుము కొట్టేది దళితులు. కాని నిన్నటి ఉత్సవంలో ఉరుము ఎవరు కొట్టారని ప్రశ్నిస్తున్నాం. ఉత్సవంలో ఉరుము సౌండ్ గాని, మేళతాళాలు కాని లేవు. ఎందుకంటే, ఇక్కడ కలెక్టర్ గంధం చంద్రుడు ఉంటే వీరి పప్పులు ఉడకవని వారికి తెలుసు. 

                అందులోనూ ఇటీవలి కాలంలో జిల్లాలో మాల, మాదిగ, హరిజనవాడ వంటి కులాలను సూచించే పేర్లను తొలగించేశారు.ఎక్కువ చోట్ల అంబేడ్కర్ పేర్లు పెట్టారు. కలెక్టర్ విప్లవాత్మకంగా చేపడుతున్న పనులు చూసి, ఆయనను ఎక్కువ కాలం ఉంచరని ఆనాడే భావించాము. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని భయపడి పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ గంధం చంద్రుడుగారిపై ఇదంతా చేస్తున్నారు. ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో తిరిగే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు అంటే అభిమానం ఉండేది. కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి బెస్ట్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్న కలెక్టర్ చంద్రుడుగారిపై ఇలాంటి కుట్రలు బయటకు రావడంతో ఆయనపై ఉన్న గౌరవం పోయిందని తెలియచేస్తున్నాం. కలెక్టర్ గంధం చంద్రుడుగారిపై ఎమ్మెల్యే గారు చేసిన ప్రతి మాట కూడా అవాస్తవమని స్పష్టం చేస్తున్నాం. కనుక ఎమ్మెల్యే గారు నిజాయితీగా పనిచేస్తున్న కలెక్టర్ పై తన అగ్రకుల అహంకారంతో అనవసరంగా దూసినాడినందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో  ఆంధ్ర బహుజన ప్రజావేదిక  రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, లక్ష్మీదేవి, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటిగిరి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.లక్ష్మన్న, కె.ఆర్.హరిప్రసాద్, కదిరి టౌన్ కమిటీ కన్వీనర్ కెజిఎన్.జిలాన్, కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్ చారుపల్లి ఆంజనేయులు, కదిరి నియోజకవర్గం కో-కన్వీనర్ జయపాల్ నాయుడు, నిజామోద్దీన్, కుటాగుళ్ల రామన్న, నరసింహులు, దళిత నాయకులు అంజి,చంద్ర, శ్రీరాములు, నారాయణ, చౌడయ్య,రామప్పనాయుడు, పక్కిరప్ప, రామయ్య,శ్రీనివాసులు, శివయ్య, రామచంద్ర, నాగమల్లప్పనాయుడు, రమణ,శ్రీధర్ నాయుడు, అదెప్ప, కిష్టప్ప, మారెప్ప,రామచంద్ర,మునెప్ప, గోపాల్, రాజక రమణ, కదిరెప్ప, వీరాంజీనేయులు,శివన్న,అంజినప్ప, సిద్దూ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

                                    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: