ఇక నెట్టుకొచ్చేదెలా...?

వరుస ఓటములతో టీడీపీలో అంతర్మథనం

ఇంకా మూడేళ్లు ఎలా నెట్టుకురావాలి

ఇప్పటికే చెల్లాచెదురైనా నాయకత్వం

ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టిపెట్టని వైనం

పరిస్థితులపైనే ఆధారపడటం ఓటమికి ఓ కారణం

పార్టీ భవిష్యత్తుపై తెలుగు తమ్ముళ్లలో ఆందోళన

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రారంభమైన ఓటమి వరుసగా జరుగుతున్న ఎన్నికల్లోనూ టీడీపీకి ఎదురవుతోంది. దీంతో టీడీపీ నాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీ, బీజేపీలోకి వలసలు కొనసాగాయి. దీంతో రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పెద్ద సవాల్ గా మారింది. ఎన్నో పోరాటాలు చేశామని చెపుకొంటున్న టీడీపీ దానికి తగ్గ ఫలితం రాకపోవడంతో ఇపుడు తెలుగు తమ్ముళ్లు అంతర్మథనంలో పడ్డారు. పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉంటుందా లేక వేరే మార్గం అన్వేషించాలా అన్న రీతిలో వారి ఆలోచన ధోరణీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీ నాయకత్వం సమీపభవిష్యత్తులో పుంజుకొనేదెలా అని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో అసలు ఏపీలో టీడీపీ భవిష్యత్తు ఏంటన్నది ఆ పార్టీ కార్యకర్తలే భయపడుతున్నారు. ఇంతకీ  టీడీపీకి ఏమైంది..? చరిత్రలో ఎన్నడూ లేని ఘోర  ఓటమి ఎందుకు ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం తమ మద్దతుదారులే గెలిచారని టీడీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. మీడియా ద్వారా ప్రకటనలు చేశారు. అ లెక్కల ప్రకారం పార్టీ బలం అంచనా వేసినా.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తక్కువలో తక్కువ రెండు మూడు కార్పొరేషన్లు.. డజనుకుపైగా మున్సిపాలిటీలు నెగ్గాలి.. కానీ ఫలితాలు చూస్తే కార్పొరేషన్లలో టీడీపీ ఖాతా తెరవలేదు. ఇక మున్సిపాలిటీల్లో.. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు రెండింటికి పరిమితం అయ్యింది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలోనూ పార్టీ చతికిల పడింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంత మేలు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్పినా.. గుంటూరు, విజయవాడ కార్పోరేషన్లలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేకుండా పోయింది. 2019 ఎన్నికల నుంచి టీడీపీ ఘోర ఓటములు చవిచూస్తోంది.  కానీ ఇప్పటికైనా ఆ పార్టీ పెద్దలు అంతర్మథనం చేసుకోకపోతే ఏపీలో ఉనికే కోల్పోవాల్సి ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఎక్కడ తప్పులు జరిగాయి అనేదానిపై ఇప్పటికైనా ఫోకస్ చేయకపోతే.. పార్టీలో ఇక ఎవరూ మిగలరు.. అందరూ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా టీడీపీ ఓటమికి ప్రధాన కారణం స్థానిక నాయకత్వంపై విశ్వాసం ఉంచక పోవడమే అన్నది స్పష్టమవుతోంది.

తొలినుంచే అస్త్రసన్యాసం....?

ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు ఓటమికి సిద్ధమయినట్టు కనిపించింది. వైసీపీ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తోందని, డబ్బులు వెదజల్లుతోందని ఆరోపణలు చేసి సైలంట్ అయ్యారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించిన తమ్ముళ్లు వాటి మీద పోరాడలేదు. కొన్ని మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతుంటే.. అక్కడ అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో పడింది టీడీపీ. స్థానిక నేతలు ఎవరూ చిత్తశుద్ధితో పని చేసినట్టు కనిపించలేదు. అన్నీ చంద్రబాబే చూసుకుంటారనే స్థానిక నేతలు నిర్లక్ష్యం చేస్తే.. కొన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లోనూ అధినేత జోక్యంతో పరిస్థితి తారుమారైంది అంటున్నారు కేడర్. వీటన్నంటికీ తోడు అధిపత్య పోరు మరో సమస్యే. విజయవాడ కార్పోరేషన్‌లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందు రోజే బుద్దావెంకన్న, బోండా ఉమ, నాగుల్‌ మీరా ఎంపీ కేశినేని మీద తిరుగుబాటు ప్రకటించారు. అవసరమైతే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. పార్టీలు కుల చిచ్చును తెరపైకి చేశారు. అది ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. టీడీపీ ఒక పార్టీకి చెందినదే ముద్ర పడేలా చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతల మధ్య పోరు కొంప ముంచిందని అర్థమవుతోంది.

పరిస్థితులపై ఆధారపడటంవల్లేనా...?

రాజధాని మార్పు వ్యతిరేక ఉద్యమం కారణంగా అటు విజయవాడ, ఇటు గుంటూరు కార్పోరేషన్లలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే భావనలో ఉన్న టీడీపీ… ఆ ప్రభావం అంతా పుర పోరులో ఓట్ల రూపంలో తమకు అనుకూలిస్తుందని భావించింది. ఈ రెండు కార్పోరేషన్లను సొంతం చేసుకుని… ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పాలనేది టీడీపీ ఆలోచన. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత… కార్మికులు, ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఆందోళనలు, బంద్ లు, నిరసనలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతోందంటూ వైసీపీపై టీడీపీ ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… ఓటుతో సమాధానం చెప్పాలంటూ టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేశారు కూడా. కానీ అక్కడ ఫలితం కూడా టీడీపీకి మింగుడు పడటం లేదు. మెజారిటీ స్థానాలను దక్కించుకున్న వైసీపీ… టీడీపీని ప్రతిపక్షానికే పరిమితం చేసింది. విశాఖలో అధికార పార్టీ గెలవడం ఇదే తొలిసారి కూడా.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: