దెబ్బమీద...దెబ్బ....?

చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్దమా...?

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు

చంద్రబాబు ముందున్న అవకాశాలేమిటీ...?

అరెస్ట్ కాక తప్పదా...? 

సీఐడీ నోటీసులపై భగ్గుమంతున్న తెలుగు తమ్ముళ్లు

వరుస ఓటములతో పార్టీలో సంక్షోభం...? 

ఈ సమయంలో నోటీసులు

బాబు అరెస్ట్ అయితే పరిస్థితి ఏమిటీ...పార్టీలో అంతర్మథనం...?

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

ఎన్నికల్లో వరుస ఓటములతో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీకి మరో సవాల్ ఎదురవుతోంది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికార్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. చంద్రబాబుకు జారీచేసిన నోటీసులోని పలు సెక్షన్లు టీడీపీ రాజకీయ భవిత్వం నిర్ణయించేలా ఉన్నాయని ఆ పార్టీలోనే ఆందోళన మొదలైంది. మరోవైపు ఈ నోటీసులపై ఏం చేయాలి అన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇదిలావుంటే ఈ నోటీసుల వ్యవహారం టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వరుస ఓటముల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే పార్టీ పరిస్థితి ఏమిటీ అన్నది తెలుగు తమ్ముళ్ల ఆందోళనగా కనిపిస్తోంది.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ తప్పదా? ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో అంశాలు ఆ దిశగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు సీఐడీ నోటీసుల జారీపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు సీఐడీ విచారణకు హాజరవుతారా? లేదా? ఇంకెలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అసలు చంద్రబాబు ముందున్న మార్గాలు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే న్యాయ నిపుణులు ప్రకారం ప్రస్తుతానికి చంద్రబాబు ముందు ఆ మూడు మార్గాలే ఉన్నాయని చెబుతున్నారు. నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులకు సహకరించి, విచారణకు హాజరవడం. తాను ఏ నేరం చేయలేదని సీఐడీ నోటీసులపై చంద్రబాబు కోర్టుకు వెళ్లడం.. దీనిపై క్వాష్ పిటిషన్‌ దాఖలు చేయడం. ముందస్తు బెయిల్‌ కు దరఖాస్తు చేసుకోవడం తప్ప ఆయనకు మరో మార్గంలేదన్నది న్యాయ నిపుణుల మాట. ఇదిలావుంటే మార్చి 23వ తేదీన విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా.. 23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడీ ఆఫీసుకు రావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్‌ 41A(3)కింద అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ అభిప్రాయాలను బట్టి చూస్తే చంద్రబాబు అరెస్ట్ తప్పదు అన్నట్లుగానే సంకేతాలు వెలువడుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలవుతోంది. ఇదిలావుంటే ఏపీ సీఐడీ నోటీసుల జారీ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. ఈనెల 23న సీఐడీ విచారణకు హాజరుకావాల్సిన అంశంపై సలహాలు తీసుకున్నారు. నోటీసులపై కోర్టుకి వెళ్లే అవకాశాన్ని పరిశీలించారు. దీంతో పాటు గతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించారు. విచారణకు హాజరుకావాలా? వద్దా? అనేదానిపై చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకున్నారు. అంతకుముందు అమరావతిలో భూముల వ్యవహారంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న సీఐడీ… ఆయనపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 217, 123 B రెడ్‌ విత్‌ 34, 35, 36, 37 తో పాటు, SC, ST ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ యాక్ట్, ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత విచారణ జరపడం కోసం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే ఈ కేసు వ్యవహారంలో గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌ను సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

తిరుపతి ఉప ఎన్నికలు...ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు...? పార్టీ పరిస్థితి ఏమిటీ....?

ఇదిలావుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే సందర్భంలో గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలావుంటే ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి ఇంకా తెరుకోకముందే టీడీపీ నాయకత్వానికి మరో గట్టి షాక్ ఇచ్చేలా చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఘోర ఓటమితో పార్టీలో పరిస్థితి అగమ్య గోచరంగా మారడం, మున్ముందు పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న ఆందోళన టీడీపీలో నెలకొంది. ఈ పరిస్థితిలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీకావడంతో పార్టీని కాపాడేవారెవ్వరూ అన్న ఆందోళన ఆ పార్టీలో మొదలైంది. టీడీపీకి ఉన్న ఏకైక ఆధారం చంద్రబాబుయే. ఆయనే అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే త్వరలో జరిగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పరిస్థితి ఏమిటీ...ఆ పై జరిగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పరిస్థితి ఏమిటీ అన్నది ఆ పార్టీలో అంతర్మథనం మొదలైన్నట్లు సమాచారం. వరుస ఓటములు...నేతల వలసెళ్లి పోవడం వంటి పరిణామాలతో ఇప్పటికే టీడీపీలో ని శ్రేణులు చెల్లాచెదురైన పరిస్థితి. ఈ పరిస్థితిలో పార్టీ అధినేతయే అరెస్ట్ అయితే ఇక పార్టీని నడిపించేదెవ్వరూ...రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేది ఎవరు అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో నెలకొన్నట్లు సమాచారం.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: