మున్సిపల్ పోరులో వైసీపీ సునామీ

అన్ని జిల్లాలలోనూ ఫ్యాన్ జోరూ

పదకొండు కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే

75 మున్సిపాలిటీల్లో 74 వైసీపీకే

ఒక మున్సిపాలిటీలోనే టీడీపీ హవా

చంద్రబాబు సొంత జిల్లాలలోనూ టీడీపీ ఘోర ఓటమి

అజేయ శక్తిగా వైసీపీ

సంబరాల్లో వైసీపీ శ్రేణులు...?

పలు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవని టీడీపీ

ఉనికిలో లేకుండా పోయిన బీజేపీ-జనసేన కూటమి...?

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో వైసీపీ సునామీ సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ తన హవా కొనసాగించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ వీరోచితంగా పోరాడిన ఫ్యాన్‌ దూకుడును నియంత్రించలేకపోయింది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎక్కడా పోటీని కనబర్చలేకపోయాయి. రాష్ట్రంలోని మొత్తం 11 కార్పొరేషన్లు వైసీపీ తన ఖాతాలో వేసుకొంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు,  వైఎస్సార్‌ కడప, అనంతపురం కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇక 75 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకూ వైసీపీ 74 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనంతపురం కార్పొరేషన్‌లో టీడీపీ  ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి సున్నా వార్డులు. యనమల రామకృష్ణుడు సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది. 

సంక్షేమ పథకాలకు ఓటరు జై...

పట్టణాలు, నగరాల్లో ఓటెత్తి అధికార వైసీపీకి జనం జైకొట్టడంతో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఫ్యాన్‌’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉనికి చాటలేక చతికిలపడ్డాయి. అదే సందర్భంలో టీడీపీ సీనియర్‌ నేతల జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్‌ లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు(విజయనగరం), తునిలో యనమల రామకృష్ణుడికి, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు, హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుకూల దృక్పథంతో, సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో సరికొత్త రికార్డు దిశగా వైసీపీ దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్స్ విజయ ఢంకా మోగించింది. అదే విధంగా మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. 75 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే టీడీపీ పరిమితం అయ్యింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: