డిసెంబర్ 2020

 నటుడు నర్సింగ్ యాదవ్ నేడుగుండెపోటు తో మృతి

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)

నటుడు నర్సింగ్ యాదవ్ గురువారంనాడు గుండెపోటు తో మరణించారు. నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన 1968 జనవరి 26న జన్మించారు. నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం. నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. తర్వాత చిరంజీవి తన సినిమాలు చాలా వాటిలో అవకాశం ఇచ్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్, హైదరాబాదు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న సమయంలో నేడు గుండెపోటు రావడంతో 2020, డిసెంబరు 31న మరణించాడు.

 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

కరోనా పోవాలి....జగనన్న సంక్షేమ పధకాలు అందరికీ అందాలి

మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం నియోజకవవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు, ప్రతి ఒక్క ఉద్యోగికి, మీడియా మిత్రులకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంకే వెంకటరెడ్డి నూనత సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా క్రిస్మస్, ముక్కోటి ఏకాదశితో పండుగలతో పాటు నూతన సంవత్సరం 2021ని ఆహ్వానాన్ని  పలుకుతూ ప్రజలందరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో జంకే వెంకట రెడ్డి
  ఏ.పి.ఎన్.జి.ఓ.అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు ఆధ్వర్యములో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మార్కాపురం నియోజక వర్గం మాజీ ఎం.ఎల్.ఎ., రాష్ట్ర వై.సీపీ. ప్రధాన కార్యదర్శి జంకే వెంకట రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ ప్రజలు, ఉద్యోగులు, కార్మిక, కర్షక, వర్గాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, వారి కుటుంబసభ్యులందరికి పేరుపేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.
ఏ.పి.ఎన్.జి.ఓ.అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు
రాబోయే నూతన సంవత్సరములో కరోన మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని కోరుకుంటూ, జగనన్న పాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందరికి అంది వారి కుటుంబాలలో ఆనందాలు వెళ్లి విరియాలని  ప్రజలందరూ ఆయుఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాని తెలిపారు.

 నెల నెలా ప్రకటనలు వచ్చేలా చేయండి

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చిన్న పత్రికల సంఘం వినతి

సి.ఎం.కేసీఆర్ కు నివేదిక అందజేస్తా-వినోద్ కుమార్ హామీ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ రాష్ష్ట్ర  ప్రణాళికా సంఘం   ఉపాధ్యక్షులు  వినోద్ కుమార్ ను   చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు గురువారం ఉదయం కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ స్మాల్ మీడియం  న్యూస్ పేపర్స్ మరియు  మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు  యూసుఫ్ బాబు  గారి ఆధ్వర్యంలో  తేదీ  31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల   మినిస్టర్స్  క్వార్టర్స్  లో  శ్రీ బోయిననపల్లి   వినోద్ కుమార్  గారిని వారి   నివాసంలో   కలిసి  చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది.
ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక  రాక  చిన్న పత్రికలు  మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ,  కావున   చిన్న పత్రికల కు  ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను  సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా  కోరడం జరిగింది.  అన్ని విషయాలు వినోద్ కుమార్ గారికి వివరంగా వివరించగా  సానుకూలంగా స్పందిస్తూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత  సీఎం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు  యూసఫ్ బాబు ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ , ఉపాధ్యక్షులు జానకిరామ్ సీఆర్. అగస్టీన్ , రాష్ట్ర నాయకులు  బి.వెంకటయ్య, జూన్ షహీద్, అఫ్రోజ్, ఖాసిం తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్, వినోద్ కుమార్ గారి ప్రజా సంబంధాల అధికారి రవి ప్రతాప్ చావ్లా పాల్గొన్నారు.

2020వ సంవత్సరంలో అతిపెద్ద షోగా నిలిచిన...

బిగ్‌బాస్‌ తెలుగు గ్రాండ్‌ ఫైనల్‌

భారతదేశంలో ఎక్కువ మంది వీక్షించిన రియాల్టీ షో

21.7 టీవీఆర్‌తో అతిపెద్ద సీజన్‌ ఫైనల్‌

వీక్షకులకు ధన్యవాదములు తెలుపుతూ...ట్విట్‌ చేసిన నాగార్జున 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

స్టార్‌మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో, బిగ్‌బాస్‌ అత్యద్భుతమైన ఫైనల్‌తో వైభవంగా ముగిసింది. డిసెంబర్‌20,2020వ తేదీన అభిజీత్‌ దుడ్డాలను తమ నాల్గవ సీజన్‌ విజేతగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఈ కార్యక్రమం టెలివిజన్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. రికార్డు స్థాయిలో 21.7 టీవీఆర్‌ రేటింగ్స్‌ను సాధించింది. అర్బన్‌ 15+ వీక్షకుల నడుమ హెచ్‌డీ వీక్షకులతో కూడా కలిపి ఈ రేటింగ్‌ సాధించింది. జంట నగరాలలో రికార్డు స్థాయిలో  12.3 మిలియన్‌ల  ఇంప్రెషన్స్‌ ఈ షోకు నమోదయ్యాయి. తద్వారా ఈ షో సాటిలేని వీక్షణ అనుభవాలను నమోదు చేసింది. సోషల్‌ మీడియాలో ఇప్పటికే 2021 లో తరువాత సీజన్‌ను త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరుతూ ట్రెండింగ్‌ కూడా చేస్తున్నారు.  తమ వైవిధ్యమైన, సంపూర్ణమైన నాయకత్వంతో స్టార్‌ మా, 2021లో అత్యున్నత శిఖరాలను పలు  ఫిక్షన్‌ మరియు నాన్‌ ఫిక్షన్‌ షోలతో అధిరోహించింది.

 రైతులను చర్చలకు పిలవవాలి

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతా మోహన్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఆందోళన చేస్తున్న రైతులను చర్చలకు పిలిపించి వారి సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ చింతా మోహన్ రావు డిమాండ్ చేశారు. గురువారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని అయిన ఢిల్లీ నలుమూలల్లో గత నలభై రోజులుగా రోడ్లను దిగ్బంధం చేసి నిరసన తెలియజేస్తున్న రైతులను చర్చలకు పిలిచి సరైన నిర్ణయాలు తీసుకోకుండానే బిజెపి ప్రభుత్వం మొండి వైఖరి  వినిపించడం సరైన చర్య కాదనిభావిస్తున్నాం ఈరోజు రైతులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని రక్షించుకోవడానికి ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా ఈ దేశంలో ఉన్న అన్నదాతలను బతికించుకోవాలి అని ఒక గట్టి నిర్ణయం తో ముందుకు వెళ్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా వారి వెంట ఉండి వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం మన రాష్ట్రంలో ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో  అరాచకమైన పాలన కొనసాగుతోంది నిన్న కర్నూల్ లో జరిగిన దాడి మొన్న పొద్దుటూరు లో జరిగిన దాడి అంతకంటే ముందుకు అనంతపూర్ లో జరిగిన దాడులు ఈ విధంగా ఈ దాడులు జరుగుతున్నాయి  రాష్ట్రవ్యాప్తంగా  ఈరోజు జగన్ ప్రభుత్వం తీరును చూస్తుంటే ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు అని ఆయన పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ ప్రసాద్ గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇసుక సరఫరా లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ విధానం వల్ల ఇసుక ఐదు రెట్లు పెరిగి ప్రజలకు  తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని  వాపోయారు పాత విధానంలోనే ఇసుకను ప్రజలకు అందుబాటు లో ఉండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవాదళ్ రాష్ట్ర  కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ .ఎస్సీ. ఎస్టీ .మైనార్టీల ,మీద ఎన్నో రకాలుగా దాడులు చేస్తూ  భయభ్రాంతులకు గురయ్యే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరమని ఇటువంటి దాడులు  అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదని వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు జగన్ ఇటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కీ ప్రజలు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు సంతోష్, మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు

 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని

జనవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు జాతా

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనవరి 1 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు రైతు జాతాను జయప్రదం చేయాలని హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు ఉపయోగపడే వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ చట్టాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు, పేదలకు నష్టం చేసే విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని, వ్యవసాయ పంటలకు స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసు చేసినట్లుగా ఉత్పత్తి ఖర్చులపై 50శాతం కలిపి మద్దతు ధరల గ్యారంటి చట్టం చేయాలని, రుణ విమోచన చట్టం చేయాలని, అన్ని రకాల రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో రైతు జాతా జరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలను కలుపుకొని జాతా ముందుకు సాగుతుంది. జనవరి 1న సంగారెడ్డి పట్టణంలో జాతా ప్రారంభమవుతుంది. రైతాంగాన్ని చైతన్యం చేయడానికి, వ్యవసాయ చట్టాల పట్ల అవగాహన కల్పించాడానికి జరిగే జాతాలో రైతాంగం, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, మేధావులు, ప్రముఖులు పాల్గొంటారు. జాతాను ప్రజలు ఆదరించాలని కోరుతున్నాము. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో జాతా బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, మాదినేని లక్ష్మీ, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, పిఎన్‌యం రాష్ట్ర నాయకులు కోట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆరోగ్యప్రధాయని చిత్రం ఆవిష్కరించిన..

ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

నూతన సంవత్సరం 2021ని పురస్కరించుకుని నేడు గురువారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ఆరోగ్యప్రధాయని కొర్రమట్ట చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం  ఆవిష్కరించారు. కొర్రమీనులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయని, తొందరగా జీర్ణమై ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు.
1.1.2021 నూతన సంవత్సరం, ప్రపంచ నలుమూలలా ఐక్యత శాంతి అభివృద్ధి లో దూసుకుపోవలని,'ఇండియన్ యూనిటీ' భిన్నత్వంలో ఏకత్వం, మన సంస్కృతి వారసత్వం, మన ఐకమత్యం భారతజాతికి మహాబలం.నూతన సంవత్సరం భారతదేశం లో జరుగుతున్న చెడు పరిణామాలను కరోన ను అధిగమించి, అందరి హృదయాలలో సంతోషాలు నింపాలని శాంతిభద్రతలు సహజీవనం ఐక్యత వెళ్లివిరియాలని బంగారు తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శనం కావాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం,నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, రవళిక, ముస్తఫా,పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

 కొత్త సంవత్సర వేడుకల రద్దు

క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ 


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఈ ఏడాది మృతి చెందిన న్యాయ వాదులకు సంతాప సూచకంగా కొత్త సంవత్సర వేడుకల ను రద్దు చేసినట్లు క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి వెంకటరమణ, బాలరాజు గౌడ్ ప్రకటన ద్వారా వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వేడుకలను రద్దు చేసినట్లు తెలిపారు. 2020 సంవత్సరంలో మృతి చెందిన న్యాయ వాదు లందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలిపారు.

2020..విజన్ కాదు...ఓ మెసేజ్

 


2020... ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది కలలు కన్న విజన్. ప్రపంచమంతా ఎన్నో ఆశలు, ఆశయాలతో 2020 విజన్ సాధించుకునేందుకు ముందుకు సాగింది. శాస్త్రవేత్తలు, మేథావులు, రాజకీయనాయకులు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారూ తాము అనుకున్న గొప్ప లక్ష్యాలు, ధ్యేయాలను 2020కల్లా సాధించుకోవాలని కలలు కన్నారు. అయితే అందరి ఆశయాలపై, ఆశలపై, లక్ష్యాలపై కరోన బుసకొట్టింది. అందరి ఆశలపై నీళ్లుచల్లింది. కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ప్రపంచం చవిచూసింది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కంటికి కనిపించని పురుగు దశాబ్దాలుగా మనిషి సాధించిన శాస్త్రసాంకేతికతను వెక్కిరించింది. చేతిలో ఏమీలేకపోయినా మాటిమాటికీ చేతులు కడుక్కునేలా చేసింది. నిర్బంధంగా మాస్కుధరించేలా చేసి అందరి నోటికి తాళాలు వేయించింది. ప్రకృతి మనిషి గుత్తాధిపత్యం కాదని, ప్రపంచ వనరులకు, ప్రాణకోటికంతటికీ పైన బిగ్ బాస్ ఉన్నాడనే విషయం 2020 తెలిసొచ్చేలా చేసింది. మనిషి కట్టుబాట్లకు, నియమనిబంధనలకు లోబడి జీవితాన్ని గడపాలనే సందేశాన్ని ఇచ్చింది. పుట్టుకే కాదు, చావూ మన చేతులో లేదని చెప్పకనే చెప్పింది. మనిషి జీవితం క్షణభంగురమని, ప్రాణం పోకడ, రాకడ మనచేతిలో లేవనే విషయాలు కళ్లముందే తెలిసివచ్చాయి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించడం, పరిశుద్ధ వస్తువులను తినాలన్న ఖుర్ఆన్ ఉద్బోధ పాటించడమే మనందరికి మేలైన పద్ధతి అన్న విషయం బోధపడింది. వృథాను అరికట్టి పొదుపుగా ఎలా వాడుకోవాలో నిర్బంధంగా తెలియజేసింది.  వృథా ఖర్చు చేయకండి అన్న ఖుర్ఆన్ సూక్తి నిర్భంధంగా అమలయ్యింది. ప్రేమ, కరుణ, ధాతృత్వం అలవర్చుకోవాలన్న అల్లాహ్ సూచనలు కళ్లముందు కనిపించాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారు. ధాతృత్వం వెల్లివిరిసింది. తమ సొంత ఆస్తులను సైతం అమ్మేసి తోటి వారి అవసరాలను తీర్చిన త్యాగాలు మన చుట్టూ కోకొల్లలు జరిగాయి. ఎంతోమంది అయినవారిని, అందరి వారిగా చెలామణి అయిన ఎంతోమంది ప్రముఖులనూ కోల్పోయాము. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, అందరూ ఎప్పుడో అప్పుడు పోవాల్సిన వారమేనన్న చేదు వాస్తవాన్ని కరోనా మాటిమాటికీ గుర్తుచేసింది. కరోనా మిగిల్చిన సంక్షోభాలనుంచి, విషాదాల నుంచి గుణపాఠాలను నేర్చుకుని ముందుకెళితే 2021 సంతోషాలకు, సౌభాగ్యాలకు నాంది పలకవచ్చు. విజన్ 2020 కాస్తా మెసేజ్ 2020గా మహా సందేశమే ఇచ్చి వెళ్లిపోయింది.

✍️ రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

 గెలుపెవరిది...?

ఉత్కంఠ రేపుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు

గెలుపుకోసం అన్ని పార్టీలు సమాయత్తం

దుబ్బాక గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ

గత అనుభవాలతో టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు

పాత సీటు కోసం కాంగ్రెస్ యత్నాలు


తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో అందర్ని ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నికల తరహాలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా ఆసక్తిగా మారాయి. అధికార టీఆర్ఎస్ సీటు అయిన దుబ్బాకను బీజేపీ కైవసం చేసుకోవడంతో అధికార టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక గత దుబ్బాక అనుభవాలను గుర్తుంచుకొన్న టీఆర్ఎస్ ఈ సారి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తన పట్టునిలుపుకోవాలని యోచిస్తోంది. ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఒకపుడు కాంగ్రెస్ ఖాతాలో ఉండేది. దీంతో ఈ ఉప ఎన్నికలతోనైనా సరే ఆ సీటును తిరిగి తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది.

ఇదిలావుంటే నల్గొండ జిల్లా లోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు కసరత్తును ప్రారంభించాయి. నాగార్జున సాగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే నోముల నరసింహం ఇటీవలే ఆకస్మికంగా మరణించారు. దీంతో మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలపై  అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. బిజెపి పార్టీ ఇప్పటినుంచే ప్రచార పంథా ను అవలంభిస్తోందని తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కార్యకర్తల గ్రూపులను నమోదు చేసి బలాన్ని ప్రోగు చేసుకునే పనిలో నిమగ్నమైంది. బిజెపి నేత కంకనా ల నివేదిత ఇప్పటినుంచే ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్యకర్తల బలన్ని పెపొందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి సైతం ఈ నియోజక వర్గంలో పట్టుంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తన పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.


నోముల నరసింహం మృతి పట్ల ప్రజలు సానుభూతి తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. సానుభూతిని సొంతం చేసుకునే దిశగా తెరాస నేతలు పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 49 కార్పొరేట్ సీట్లను గెలిచి ఊపు మీద ఉన్న బిజెపి ఇక్కడ కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ ఉపఎన్నికలో కూడా గెలిచి అధికార పార్టీకి చెక్ పెట్టాలని యోచిస్తోంది. తెరాస పార్టీ సైతం పథకం ప్రకారం విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెరాస పార్టీ  అధిష్టానం యోచిస్తోంది. త్రిముఖ పోటీలో చివరకు గెలుపెవరిని వరిస్తుందో వేచి చూడాలి

✍️ రచయిత-డి.అనంత రఘు

అడ్వకేట్...సీనియర్ జర్నలిస్ట్

 వైసీపిని....

అజేయశక్తిగా నిలిపిన 2020

ఇతర పార్టీల నేతల రాకతో నిండు కుండలా వైసీపీ

లోలోన లుకలుకలు...అయినా గీతదాటకుండా నియంత్రించిన నాయకత్వం

ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశమే లేకుండా...కలిసొచ్చిన లాక్ డౌన్ కాలం

సంక్షేమంలో దూకుడు...సాహసోపేత నిర్ణయాలు

మూడు రాజధానుల నిర్ణయంపై  జనంలోకి....ప్రతిపక్షాలపై పైచెయ్యి సాధించే యత్నం

నవ్యాంధ్ర తొలిసారిగా అధికారం చేపట్టిన వైసీపీకి 2020 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ ఓ అజేయశక్తిగా ఎదగడంలో ఈ ఏడాది అవకాశాలు ఆ పార్టీకి బాగా కలిసొచ్చాయి. టీడీపీతో సహా ఇతర పార్టీల నేతల వలసల కారణంగా ఆ పార్టీ నిండుకుండలా తయారైంది. అయితే అదే సందర్భంలో గతానికి భిన్నంగా వైసీపీలో గ్రూపు రాజకీయాలు పైకి కనిపించకపోయినా అసమ్మతి స్వరాలు ఉన్నాయన్న సంకేతాలు ఈ ఏడాదిలో కనిపించాయి. ఇక సంక్షేమ పథకాల దూకుడుతో ప్రతిపక్షాలకు ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్ డౌన్ కాలం కాస్త వైసీపీకి కలిసొచ్చింది. కారణం ప్రభుత్వ విధానపరమైన కొన్ని నిర్ణయాలను రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రొడ్డెక్కి ప్రత్యక్ష ఆందోళనలు చేయలేని పరిస్థితి లాక్ డౌన్ కాలంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు మాత్రం వైసీపీకి మున్ముందు సవాల్ విసిరే పరిస్థితులు 2020వ సంవత్సరంలో నెలకొన్నాయి.

బీజేపీ, జనసేన జట్టుకట్టడం, టీడీపీ కూడా బీజేపీకి దగ్గరయే పరిస్థితులు కనిపించడంతోపాటు సొంతంగా రాష్ట్రంలో ఎదిగేందుకు కమలనాథులు సొంత వ్యూహాలతో ముందుకెళ్లడం మాత్రం వైసీపీకి ఈ ఏడాదిలో కొంత రుచించని పరిణామం. దేవాలయాలు, ఇతర మతపరమై అంశాలతో బీజేపీ దూకుడు పెంచడంతో వైసీపీకి అపుడపుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏడాదిలో ఎదురయ్యాయి. అదే సందర్భంలో వైసీపీ లో గ్రూపు రాజకీయాలకు బీజంపడ్డ అది రొడ్డెక్కే స్థాయికి ఇంకా రాకపోవడం ఆ పార్టీకి కొంత ఆశాజనకంగా మారిన ఈ ఏడాదిలో అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ సొంతపార్టీపై గళం ఎత్తుతున్న తీరు మాత్రం కాస్త రుచించని విధంగా తయారైంది. కరోనా అంశం పక్కనెడితే రాజకీయంగా చూసుకొంటే వైసీపీకి 2020 సంవత్సరం మాత్రం ఆశాజనకంగానే మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2020 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా జరగకపోయినా ఏకగ్రీవాల రూపంలో కొన్ని స్థానాలను నిలుపుకొని తన ప్రభావం చాటింది.


నిండుకుండలా

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక... ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరతీసి... 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకుంది టీడీపీ. ఇప్పుడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ పార్టీకి అధికార వైసీపీ నుంచి ప్రతి రోజు సవాళ్లు ఎదురవుతున్నాయి. టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి వలసలు ఈ ఏడాది సాగాయి. టీడీపీ లాగా తాము ఫిరాయింపులకు ప్రోత్సహించే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంతో... ఆపరేషన్ ఆకర్ష్ అనేది వైసీపీ నుంచీ ఉండకపోయినా... టీడీపీకి రాజీనామా చేసి... తిరిగి ఉప ఎన్నికలు రప్పించి... వాటిలో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచే ఆలోచనలో ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా ఈ ఏడాది వైసీపీ బలోపేతం అవ్వడానికి దోహదపడింది. అదే సందర్భంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందన్న ఆరోపణలు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైసీపీలో చేరారు.

 

సంక్షోభంలోనూ సంక్షేమం...ఇదే వైసీపీకి 2020 కలిసొచ్చేలా చేసింది...?

కరోనా సంక్షోభంతో యావత్తు ప్రపంచం ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతుంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షోభంలోనూ సంక్షేమ బాటేనని స్పష్టంచేస్తోంది. ప్రజా సంక్షేమం విషయంలో రాజీపడమని చెప్పిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే సంక్షేమ పథకాల అమలుకు అడుగులేస్తోంది. రాష్ట్రంలో ఓవైపు మద్యం అమ్మాకాలు తగ్గిస్తూ తన ఆదాయానికి గండిపడినా ఎక్కడా ఏ మాత్రం ప్రజా సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడంలేదు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పలు రకాల విపత్తులతో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల ఆధాయ వనరులపై శ్రద్ద వహిస్తూనే ఇతర సమస్యల పరిష్కారానికి మొగ్గుచూపుతోంది. ఈ 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలండర్ ను ఆ విష్కరించింది. దీంతో మరోసారి సంక్షేమంలో రాజీపడ్డమన్న సంకేతాలను వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది.

 


అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఈ  ఏడాదిలో కాస్త దూకుడు పెంచి ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసింది. వైసీపీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఎలావున్నా సంక్షేమం విషయంలో మాత్రం ప్రతిపక్షాలకు నోరెత్తే అవకాశమే లేకుండా ఈ సర్కార్ చేస్తోందని రాజకీయ వర్గాల మాట. ఇందుకు తాజా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇక సంక్షేమ పథకాలలో ఏమైన లోపాలు ఎత్తిచూపే అవకాశం కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లేకుండా పోయింది. కారణం టీడీపీ గత ఐదేళ్ల పాలనలో 2019 ఎన్నికలకు ముందు ఆరు నెలల కాలంలో సంక్షేమ పథకాలపై నాడు ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇదే టీడీపీకి ఇపుడు సంకటంగా మారింది. సంక్షేమం విషయంలో నిలదీయలేని స్థితికి టీడీపీ చేరుకొంది.

తొలినుంచే సంక్షేమంపై వైసీపీ దృష్టి...?

అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం హిస్టారికల్ డెసిషన్. అమ్మ ఒడి స్కీమ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తమ పిల్లలను స్కూలుకు పంపించిన ప్రతి తల్లి ఖాతాలో డబ్బులు వేసి ప్రోత్సహిస్తున్నారు జగన్. ఇది ఒకరంగా భవిష్యత్తులో దేశంకు మ్యాన్‌పవర్ ఇవ్వడమేనని వైసీపీ నేతల భావన. పేదల పిల్లలను కూడా ధనికుల పిల్లలతో ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా సమానత్వం కల్పిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత రజకులు, టెయిలర్స్, బార్బర్స్, ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్, వీళ్లకు ఫైనాన్స్ హెల్ప్ అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. ప్రత్యేకించి కరోనా సమయంలో వారికి చేసిన ఈ సహాయం వారెప్పుడూ మరవలేరు. ఆరోగ్య శ్రీ సంస్కరణలు తీసుకొచ్చారు. వెయ్యి రూపాయలు వైద్యం దాటిన ప్రతి ఒక్కరికీ కుల, మత పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆపరేషన్ జరిగితే రెస్ట్ పీరియడ్‌లో ఇన్‌సెంటివ్స్ ఇస్తామన్నారు..క్యాన్సర్ డయాలసిస్, పెరాలసిస్, పేషంట్స్‌కు పెన్షన్ ఇవ్వడం ద్వారా ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా తన తండ్రి కంటే నాలుగడుగులు ముందుకేసి నిరూపించాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.జగన్ దృష్టి మొత్తం విద్య, వైద్య, వ్యవసాయంపైనే ఉంది. ఈ మూడు కూడా పునరుత్పత్తి పద్దతిలో చూడాలి.

ఈ మూడు రంగాల్లో చాలా స్ట్రాటజిక్‌‌గా వెళుతున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్లోనే ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం చేయడం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వివిధ వర్గాల సంక్షేమంపై శ్రద్దపెట్టింది. దీంతో ప్రతిపక్షాలకు ఏ మాత్రం పనిలేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ప్రయత్నాలకు కూడా వైసీపీ సంక్షేమ పథకాలు గండికొడుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ వివిధ ప్రభుత్వ విధానాలపై పోరాడినా అది బీజేపీకి కలిసొచ్చింది మాత్రం నామ మాత్రంగా కూడా లేదు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా పోరాడుతూనే బీజేపీ కి మిత్రపక్షంగా చేరారు. దీంతో ఆయన చేసిన పోరాటం సైతం పెద్దగా ఆ పార్టీకి గానీ బీజేపీకి గానీ కలసిరావడంలేదు. పైగా పవన్ కళ్యాణ్ విమర్శలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవడంలేదు. తాను చేయదల్చిన సంక్షేమ పథకాల అమలుపైనే ఆయన ప్రధానంగా శ్రద్ద పెడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇరకాట స్థితిని ఎదుర్కొంటున్నాయి.

 


పార్టీలో ధిక్కార స్వరాలకు బీజం

ప్రభుత్వ పనితీరును ప్రతిపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని స్థితిలో అధికార పక్షం నుంచే ఏడాదిలో విమర్శలు మొదలయ్యాయి. ఐదేళ్ల పాటు విప‌క్షంలో ఉండ‌గా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూ సాగించిన పోరాటాల‌తో చివ‌ర‌కు వైసీపీ అధికార పీఠం ద‌క్కించుకొంది.  తీరా ఆరు నెల‌ల గ‌డ‌వ‌క‌ముందే అప్పుడే పార్టీలో ధిక్కార స్వ‌రాలు పెరుగుతున్న తీరు చ‌ర్చ‌నీయమైంది. తొలుత న‌ర్సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపింది. పార్టీ వైఖ‌రికి భిన్నంగా పార్ల‌మెంట్ వేదిక‌పై మాట్లాడ‌డంతో అంత‌ర్గ‌తంగా లుక‌లుక‌లున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. దానిపై సీరియ‌స్ అయిన పార్టీ వెంట‌నే ఆయ‌న వివ‌ర‌ణ కోరడం, ఆయ‌న నేరుగా సీఎంని క‌లిసి త‌న వాద‌న వినిపించారు. అయితే అంత‌టితో ఆ క‌థ ముగిసిపోయింద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న హ‌స్తిన‌లో ఎంపీల‌కు విందు ఏర్పాటు చేశారు. వ్య‌క్తిగ‌తంగా అన్ని పార్టీల నేత‌ను పిలిచి ఆయ‌న విందు ఏర్పాటు చేయ‌డం విశేషంగా మారుతోంది. అందులోనూ దానికి వేదిక‌గా కేవీపీ రామ‌చంద్ర‌రావు ఇంటిని నిర్ణ‌యించ‌డం ఆస‌క్తిరేపింది. అదే స‌మయంలో ర‌ఘురామ‌కృష్ణం రాజు త‌ర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి కూడా వ్య‌క్తిగ‌తంగా పీఎంతో భేటీ కావ‌డం వెనుక కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

వాట‌న్నింటికీ మించి నెల్లూరు వ్య‌వ‌హారం ర‌స‌రంజ‌కంగా మారుతోంది. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి నేరుగా నెల్లూరులో మాఫియా న‌డుస్తోందంటూ వ్యాఖ్యానించ‌డం పార్టీలో కలకలం రేపుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా సీనియ‌ర్ నేత‌లు ధిక్కార స్వ‌రాలు వినిపిస్తున్న త‌రుణంలో వైసీపీలో ఈ ప‌రిణామాలు ఎటు మ‌ళ్లుతాయన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ప్ర‌స్తుతం పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ నేత‌లంతా వివిధ పార్టీల నుంచి ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్న‌వారే కావ‌డం విశేషం. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెంట ఉన్న వారంతా అధినేత మీద విశ్వాసంతో సాగుతుంటే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లు మాత్రం త‌మ‌కు తోచిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ర‌ఘురామ‌కృష్ణం రాజు అయితే గ‌తంలో వైసీపీలో పనిచేసి, ఆత‌ర్వాత బీజేపీ, టీడీపీ మీదుగా మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరారు. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా అదే రీతిలో వివిధ పార్టీలు మారి వైసీపీ గూటిలోకి వ‌చ్చారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా అదే రీతిలో పార్టీలో చేరారు. ఇలాంటి వ‌ల‌స నేత‌ల మూలంగానే ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి, ఎవరినీ కలవరు అని, ఎవరి మాట లెక్క చెయ్యరు అని, ఎవరి సలహాలు తీసుకోరు అని, అసలు తమకు లెక్క చెయ్యటం లేదని, సీనియర్లకు లోలోపల నెలకొన్న భావన అడపాదడపా ఇది బయట పడుతూనే ఉందని రాజకీయ విమర్శకుల మాట. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న తమను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికీ, అవగాహన లేని వారిని అందలం ఎక్కిస్తున్నారనే కోపం సీనియర్లకు ఉంది అన్న చర్చ కూడా లోలోన సాగుతోంది. ఈ ధిక్కార స్వరం, వారం రోజులుగా ఎక్కువ అయ్యింది. వినుకొండ ఎమ్మెల్యే, బహిరంగంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్న తీరు పై గళం ఎత్తారు, ఇసుక రీచ్ నుంచి, ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావటం లేదని, గరమల్లో గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేక పోతున్నాం అన్నారు. ఇక మరో ఎమ్మెల్యే, 'జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పింది. దీన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉంది. సరిచేయకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.' అని సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రాంనాయరణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాది కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఏది, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఇంకో ఏడాది చూస్తా ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఇళ్ళ స్థాలల్లో అవినీతి, రాష్ట్రంలో మత మార్పిడులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్డినెన్స్, తిరుమల భూవివాదం, ఇలా అన్నిటి పై, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరుగుతున్నారు. ఇక గతంలో స్పీకర్ తమ్మినేని, నాటు సారా మాఫియా పై చేసిన వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీళ్ళు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, కరెంటు బిల్లుల పెరుగుదల పై, విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర వ్యాఖ్యలు, ఇలా చాలా మంది ఎదురు తిరుగుతున్నారు.

వర్గ విభేదాలు కూడా...?

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే వివిధ జిల్లాలలోని వైసీపీలో వర్గ పోరు మొదలైంది. నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు అన్న విమర్శలున్నాయి. ప్రకాశం జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. పంచాయతీ పెద్దదిగానే ఉంది. ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. మానుగుంట మహేందర్ రెడ్డి సీనియర్ నేత అయినా నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో  వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ నాయకుడు ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరు మాసాలు బాగానే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంట్రీతో ఒక్కసారిగా ప‌రిస్థితులు తారుమారు అవుతున్నాయి. ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించాల్సిన ఎమ్మెల్యే, ఇత‌ర నాయ‌కులు త‌మ స‌మ‌స్యల్లో తామే కూరుకుపోయార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా బైరెడ్డిని జ‌గ‌న్ ఇక్కడ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో బైరెడ్డి త‌న హవాను పెంచుకునేందుకు ఎమ్మెల్యేపైనే ఆధిప‌త్యం ప్రద‌ర్శించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పర్యవేక్షణలో జ‌ర‌గాల్సిన ప‌నులు కూడా తానే అన్నీ అయి చూస్తున్నారు. ఇక రాజధాని ప్రాంతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజనీ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిల మధ్య వివాదాలు జగన్ వరకూ వెళ్లినా ఇంతవరకూ ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పూర్తిగా పాలనపైనా శ్రద్దపెట్టడమేనని తెలుస్తోంది.

బందువులకు టిక్కెట్లు నో

ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటున్న వైసీపీ పార్టీ పరంగా కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై 2020వ సంవత్సరంలోనే వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్‌ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిపక్షాలకు కరోనా కష్టాలు....వైసీపీకి కలిసొచ్చిన వైనం

దేనికైనా కాలం కాలసిరావాలి అంటారు. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఏపీలో ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వీలున్నా కరోనా వైరస్ కష్టాలు మాత్రం రోడ్డెక్కలేని పరిస్థితి తెచ్చింది. ఏపీలోని ప్రతిపక్షాలకు ఇదే మైనస్ గా మారుతోంది. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతవేడిగా సాగినా 2020 సంవత్సరం ప్రతిపక్షాలకు పెద్దగా కలపిరాలేదు. కానీ అధికార వైపీపీ మాత్రం బాగా కలిసొచ్చింది. అనునిత్యం సంక్షేమ పథకాల ప్రకటనతో అధికార పక్షం వైసీపీ ప్రజల్లో ప్రత్యేక ముద్రవేసుకొంటుండగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ఇక వైసీపీ సర్కార్ ఎదుర్కొంటున్న సమస్యలలో కోర్టు తీర్పులు వల్ల ఇబ్బందులే తప్పా ఇతర విషయాలలో ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం ఇవ్వడంలేదు.

✍️ రచయిత-సయ్యద్ రహ్మత్

సెల్ నెం-7093951403


 టార్గెట్ తిరుపతి...

అక్కడ ఎలాగైనా గెలవాలి...?

ఉప ఎన్నికల్లో విజయానికి టీడీపీ ఐదంచెల వ్యూహం

సిద్ధంగా ఉన్న 8వేల బూత్‌ లెవల్‌ కార్యకర్తలు

కసరత్తు ప్రారంభించిన టీడీపీ అధినాయకత్వం

తిరుపతి గెలుపుతో పూర్వ వైభవం కోసం

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ఓ అగ్ని పరీక్షగా మారుతోంది. ఈ ఎన్నికల్లో విజయంతోనే తమకు ప్రజామోదం అన్నట్లుగా అని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అటు బీజేపీ, జనసేన కూటమి సన్నాహాలు చేసుకొంటున్ానయి. ఇందులో భాగంగా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం అడుగులు వేస్తోంది. పార్టీ విజయం కోసం ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకటన, నోటిఫికేషన్‌కు ముందునుంచే ప్రణాళికలు తయారుచేసుకున్న ప్రతిపక్షం ఇప్పటికే 8వేల మంది బూత్‌ లెవల్‌ కార్యకర్తలను  సిద్ధం చేసుకుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాలకు పరిశీలకులుగా 89 మంది సీనియర్‌ నేతలను నియమించింది. ఇతర పార్టీలకన్నా ముందే పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని అధినేత చంద్రబాబు ప్రకటించి ప్రచారం మొదలయ్యేలా చేశారు. పార్టీకి రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న రాబిన్‌ శర్మ ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. ఆయన బృందం తిరుపతి ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 


2024 అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు వ్యూహాలు రూపొందించేందుకు ‘షో టైం’ కన్సల్టెన్సీతో తెలుగుదేశం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. గత ఎన్నికల్లో వైకాపాకు పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్ ఐ ప్యాక్‌ సంస్థలో రాబిన్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. తర్వాత సొంతంగా షో టైం కన్సల్టెన్సీ ఏర్పాటుచేసిన రాబిన్‌ శర్మ 2024 వరకు తెదేపా వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.వారు ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో తమ బృందాలను ఏర్పాటుచేసుకొని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు.

 

గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో వైకాపాకు వచ్చిన మెజారిటీ మండలాలపై తెదేపా విశ్లేషణ ప్రారంభించింది. జనవరి నుంచి గ్రామాల వారీగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. అచ్చెన్నాయుడు, లోకేశ్‌, సోమిరెడ్డి, రవిచంద్ర, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, చెంగల్‌రాయుడు సారథ్యంలో మొత్తం 97 మంది సీనియర్‌ నేతలు ఓ బృందంగా ఏర్పడ్డారు. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బూత్‌, మండలం, అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థాయిలను ఐదంచెలుగా ఏర్పాటుచేసి ఇప్పటికే కమిటీలు వేశారు. బూత్‌ స్థాయిలో 8వేల మంది కార్యకర్తలు, గ్రామస్థాయిలో వేయి మంది తమ పని మొదలుపెట్టారు. మండలస్థాయిలో 40 మంది నాయకులకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. తెదేపా అధికారిక సోషల్‌మీడియా విభాగం ఐటీడీపీ సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిపై వ్యూహాలను సిద్ధం చేసింది. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏర్పాటైన కమిటీలన్నీ సమన్వయంతో పనిచేసే వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటుచేశారు.

అన్ని వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, పెరిగిన నిత్యావసర ధరలు, ఎస్పీలపై అరాచకాలు, ఇసుక, లిక్కర్‌ మాఫియా వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని ముందుకెళ్తామని తెలుగుదేశం పేర్కొంటోంది. అయితే కిందిస్థాయి నాయకులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని పార్టీ చంద్రబాబుకు చెబుతుండగా.. రాబిన్‌శర్మ బృందం మాత్రం అందుకు విరుద్ధమైన నివేదికలను అధినేతకు పంపుతున్నట్లు తెలుస్తోంది. నాయకులకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని, కార్యకర్తలను అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుంటే వారికి తక్షణ న్యాయ సహాయం అందించేలా వ్యవస్థను రూపొందించాలని రాబిన్‌ శర్మ సూచించినట్లు సమాచారం.

సుక‌న్య స‌మృద్ధి ఖాతా...

ప్ర‌యోజ‌నాలు..ప‌రిమితులు

(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప్రారంభించే ముందు అందులో ఉన్న ప్ర‌యోజ‌నాల‌తో పాటు లోపాల‌ను కూడా తెలుసుకోవాలి. సుకన్య స‌మృద్ధి ఖాతాకు ప్ర‌స్తుతం చాలా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ‘బేటీ బ‌చావో-బేటీ ప‌డావో’ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌న‌వ‌రి 22, 2015 న‌ ప్రారంభించారు. ఇందులో ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు ఏంటంటే ఇత‌ర చిన్న పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే ఎక్కువ వ‌డ్డీ రేటు, ప‌న్ను మిన‌హాయింపులు వంటివి. దీంతో ఆడ‌పిల్ల‌ల కోసం మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు ఇందులో పెట్టుబ‌డులు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ ప‌థ‌కంలో కొన్ని ప్ర‌తికూల‌త‌లు కూడా ఉన్నాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు వాటి గురించి కూడా తెలుసుకోవ‌డం మంచిది.

లాక్‌-ఇన్ పీరియ‌డ్‌

సుక‌న్య స‌మృద్ధి ఖాతా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. కాల‌ప‌రిమితి 21 సంవ‌త్స‌రాలు. ఈ ఖాతాలో 14 సంవ‌త్స‌రాలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 21 సంవ‌త్స‌రాల లాక్-ఇన్ పీరియ‌డ్ అంటే చాలా ఎక్కువ కాలం అనే చెప్పుకోవాలి. స్వ‌ల్ప కాలంలో లాభాల కోసం వేచి చూసేవారు ఇత‌ర పెట్టుబ‌డుల‌ను ప‌రిశీలించ‌డం మంచిది.

ఆన్‌లైన్ స‌దుపాయం ఉండ‌దు

సుక‌న్య స‌మృద్ధిలో ఉండే మ‌రో లోపం ఏంటంటే ఆన్‌లైన్ ద్వారా పెట్టుబ‌డి చేసే అవ‌కాశం లేదు. కేవ‌లం చెక్కు, న‌గ‌దు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్ర‌మే డిపాజిట్ చేయాలి. ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌భుత్వం దీనిని ఆన్‌లైన్ చేస్తే పెట్టుబ‌డుల‌కు సౌక‌ర్యంగా ఉంటుంది.

వ‌డ్డీ రేట్లు

సుక‌న్య స‌మృద్ధి ఖాతాపై ప్ర‌తీ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంటుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.60 శాతంగా ఉంది. ఇది పీపీఎఫ్ వంటి ఇత‌ర పొదుపు ప‌థ‌కాల కంటే కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే మార్కెట్ ఆధారిత ప‌థ‌కాల‌తో పోలిస్తే ఇందులో లాభాలు త‌క్కువ‌గానే ఉంటాయి.

ముంద‌స్తు ఉపసంహ‌ర‌ణ‌కు వీల్లేదు

ఈ ఖాతా నుంచి ముంద‌స్తుగా డ‌బ్బును తీసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఇక్క‌డ అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బు తీసుకోలేము. లిక్విడిటీ స‌మ‌స్య ఈ ఖాతాకు ప్ర‌తికూలమ‌నే చెప్ప‌వ‌చ్చు.

వ‌య‌సు ప‌రిమితి

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప‌దేళ్ల వ‌ర‌కు వ‌య‌సు ఉన్న ఆడ‌పిల్ల‌ల పేరుతో మాత్ర‌మే ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఖాతా ప్రారంభ స‌మ‌యంలో పిల్ల‌ల వ‌య‌సుకి సంబంధించిన ఆధారాన్ని స‌మ‌ర్పించాలి.

రుణ స‌దుపాయం లేదు

ఈ ప‌థ‌కం రుణ స‌దుపాయాన్ని క‌ల్పించ‌లేదు. ఒక‌వేళ కుటుంబ ప‌రిస్థితి బాగాలేక‌పోతే దీని ద్వారా రుణం పొందే అవ‌కాశం లేదు.

బాలిక పేరుతో ఖాతా

సుక‌న్య స‌మృద్ధి ఖాతా అమ్మాయి పేరుతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీనిని ఖాతాదారు కూడా నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఉంది. ఒక వ‌య‌సు వ‌చ్చాక అమ్మాయి త‌ల్లిదండ్రుల మాట విన‌కుంటే స‌మ‌స్య రావొచ్చు.

సుకన్య స‌మృద్ధి ఖాతాతో ముఖ్యంగా అమ్మాయిల ఉన్న‌త చ‌దువు, వివాహానికి భ‌రోసా ల‌భిస్తుంది. దీనికోసం ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం దీనిలో మ‌రిన్ని మార్పులు కూడా చేసే ప్ర‌తికూల‌త‌ల‌ను లేకుండా కూడా చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి స‌మ‌గ్ర వివరాలు

సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక పొదుపు పథకం. దీనిని భార‌త ప్ర‌భుత్వం ‘బేటీ బ‌చావో బేటీ ప‌డావో’ కార్య‌క్ర‌మంలో భాగంగా 2015 లో ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా ప్రారంభించింది. ఇది దీర్ఘ‌కాలిక పొదుపు ప‌థ‌కం . ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తుకి ఆర్థిక భ‌రోసా క‌ల్పించేందుకు, ఉన్న‌త విద్య‌, వివాహ స‌మ‌యాల్లో తోడ్పాటునిస్తుంది.

ఎవ‌రు అర్హులు...?

ఆడ పిల్ల పుట్టిన తరువాత నుంచి ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఖాతాను తెరవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి. అలాంటప్పుడే ఈ ఖాతా ప్రయోజనాలను పొందగలరు.

తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్య‌ప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరవ వచ్చు. ఒక‌రి కోసం రెండు ఖాతాలను తీసేందుకు వీల్లేదు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను స్వ‌యంగా నిర్వ‌హించుకోవ‌చ్చు.

వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం, చిరునామా గుర్తింపు ప‌త్రాల‌తో పాటు జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధి ఖాతాను ఆన్‌లైన్‌లో ప్రారంభించేందుకు వీల్లేదు. ప్ర‌స్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ స‌దుపాయాన్ని క‌ల్పించ‌ట్లేదు.

గడువు: సుక‌న్య స‌మృద్ధి ఖాతా మెచ్యూరిటీ గ‌డువు 21 సంవ‌త్స‌రాలు. ఉదాహ‌ర‌ణ‌కు 8 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఖాతా ప్రారంభిస్తే, అమ్మాయికి 29 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుక‌న్య స‌మృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బు తీసుకునే వీలుంది.

పొదుపు / మదుపు: ఒక ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం.

ఖాతాను ప్రారంభించేందుకు క‌నీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం .

సంవ‌త్స‌రానికి క‌నీసం రూ.250 డిపాజిట్ చేయాలి.

ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు చేయ‌వ‌చ్చు. ఒక ఖాతాలో సంవ‌త్స‌రానికి అంతంక‌టే ఎక్కువ‌గా డిపాజిట్ చేయ‌కూడ‌దు.

ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 14 సంవ‌త్స‌రాల పాటు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే, మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ. 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.

న‌గ‌దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డ‌బ్బును డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు.

ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఖాతాను 'డిఫాల్ట్ అకౌంట్’గా పరిగణిస్తారు.

ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ డిఫాల్ట్ అకౌంట్ ను 15 సంవత్సరాల పాటు క్రమబద్ధీకరించకపోతే, దాని మెచ్యూరిటీ సమయంలో ఖాతాలోని మొత్తం డిపాజిట్ పై పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటును ఆకర్షిస్తుంది.

బ్యాంకుకు త‌గిన సూచ‌న‌లు అందించ‌డం ద్వారా ఆన్‌లైన్ నుంచి డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే, ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై వడ్డీ చెల్లించరు.

ఇదేవిధంగా, 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, ఆ మొత్తంపై కూడా వడ్డీ చెల్లించరు.

వడ్డీ : సుక‌న్య స‌మృద్ధి ఖాతాపై ప్ర‌తీ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంటుంది.

ప్రస్తుతం, వడ్డీ రేటు 8.4 శాతంగా ఉంది, ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది.

ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు.

ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే వీలుంటుంది.

అయితే ఈ ఖాతాలో ప్ర‌తి నెల 10 వ తేది కంటే ముందు న‌గ‌దు డిపాజిట్ చేస్తే నెలంత‌టికీ వ‌డ్డీ ల‌బిస్తుంది.

ప్ర‌తినెల 10 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న త‌క్కువ న‌గ‌దుపై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధిపై వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వ నిర్ణ‌యిస్తుంది కాబ‌ట్టి ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అనగా 21 సంవత్సరాలు పూర్తైన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.

సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్

సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనగా మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు.

అదేవిధంగా, సంవత్సరానికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 సంపాదించవచ్చు.

 సంక్షోభంలోనూ ధీరత్వం

వలసలు వేధించినా సమర్థవంతమైన ప్రధాన ప్రతిపక్ష పాత్ర

ప్రభుత్వ వ్యతిరేక అస్త్రాలు అందొచ్చిన....లాక్ డౌన్ తో ఏమీ చేయలేని వైనం

చంద్రబాబుతోపాటు దూకుడు పెంచిన నారా లోకేష్

కరోనా కాలంలోనూ సామాజిక మాధ్యమాలతో ప్రభుత్వంపై పోరు

క్లిష్ట పరిస్థితుల్లోనూ జూమ్ లో మహానాడు నిర్వాహణ

రాజధాని అమరావతి కోసం నిరంతరం పోరు....అదే ప్లస్...అదే మైనస్...?


ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎపుడు రంజుగానే సాగుతాయి. కానీ గతానికి కంటే తాజా రాజకీయాలు ఏపీలో మరింత రంజుగా సాగుతున్నాయి. ఇక 2020వ సంవత్సరంలో కరోనా కష్టాలు వెంటాడినా, తన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగినా ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తనవంతు పాత్ర సమర్థవంతంగానే పోషించిందని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక అస్త్రాలు అందొచ్చినా రోడ్డెక్కలేని స్థితిలోనూ ఈ ఏడాదిలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని టీడీపీ అధినాయకత్వం వైసీపీ పై విమర్శనాస్త్రాలను సమర్థవంతంగా ప్రయోగించింది. అయితే వైసీపీ ప్రభుత్వం కరోనా సంక్షోభ కాలంలోనూ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా ప్రవేశపెట్టడంతో టీడీపీ వివిధ అంశాలపై చేసిన పోరాటం పెద్దగా ఫలితమివ్వకలేకపోయింది. కానీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ శ్రేణులు మాత్రం ప్రభుత్వ విధానాలను ఎప్పటికపుడు ఎండగటడంలో సఫలమయ్యారు. అదే సందర్భంలో ఏపీలో 2020లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారాయి.

బీజేపీతో జనసేన జతకట్టడంతో ఏపీలో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరుగుతున్న నేపథ్యంలో టీడీపీ తన పోరాట పంథలో మరింత దూకుడు పెంచింది. అటు వైసీపీతోపాటు ఇటు బీజేపీ కూడా సందర్భంవచ్చిన ప్రతిసారి టీడీపీని టార్గెట్ చేశాయి. దీంతో ఇరువైపుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేపట్టింది. అదే సందర్భంలో టీడీపీ అంటే చంద్రబాబు అన్న ప్రచారానికి కాస్త మార్పును ఈ ఏడాదిలో ఆ పార్టీ నాయకత్వం తీసుకొచ్చింది. చంద్రబాబుతోపాటు టీడీపీ కోసం ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఏడాది పూర్తిస్థాయిలో కథన రంగంలోకి దిగారు. దీంతో పార్టీకి నెంబర్ టూ నాయకత్వం పట్టిష్టంగా ఉందనే సంకేతాలను ఆ పార్టీ నాయకత్వం ప్రజల్లో పంపే ప్రయత్నం చేస్తోంది.

మొత్తంగా కరోనా కాలం టీడీపీకి ఏడాదిలో కాస్త ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడటం ప్రధాన ప్రతిపక్షంకు ఉన్న ఏకైక మార్గం. కొత్త ఇసుక విధానం, మద్యం పాలసీ, కరోనా వైరస్ కాలంలో ప్రభుత్వం చర్యలు, ఇతర కొన్ని తప్పిదాలు తెరపైకి వచ్చాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని జనంలోకి వెళ్లే అవకాశం ప్రధాన ప్రతిపక్షమై టీడీపీ కరోనా వల్ల కోల్పోయింది. దీంతో జూమ్ మీటింగ్ లలో తన గళాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా వినిపించినా దానికొచ్చిన మైలేజ్ కాస్త తక్కువేనని చెప్పాలి. జనంతో మమేకమై పోరాటం చేసే అవకాశం కరోనా కాలంలో లేకపోవడ టీడీపీకి మైనస్ గా మారింది. జిల్లాల వారీగా, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఆ పార్టీలో కొంత జోస్ నింపింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ జూమ్ ద్వారా మహానాడు నిర్వహించి, ఆ కార్యక్రమంలో ఆనై లైన్ లో వేలాది మంది టీడీపీ శ్రేణులు పాల్గొనేలా చేయడంలో టీడీపీ నాయకత్వం సఫలమైంది. ఇది కరోనా క్లిష్టకాలంలోనూ టీడీపీ సాధించిన ఓ గొప్ప విజయంగా పేర్కొన్నవచ్చు. ఏపీ, తెలంగాణలోని తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ సూచనల మేరకు ఆన్‌లైన్ ద్వారా టీడీపీ మహానాడు 2020లో పాల్పంచుకోనున్నారు. జూమ్ యాప్ సౌకర్యం అందుబాటులో లేని మిగతా నేతలు, కార్యకర్తలు, అభిమానులు టిడిపి అధికారిక వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ద్వారా మహానాడు ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేవిధంగా పార్టీ ఏర్పాట్లు చేసుకుంది.

కరోనా నియంత్రణ చర్యలపై గళం...?

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 2020లో కరోనాగురించే ఎక్కువగా చర్చించుకొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా నడిచింది. కరోనాపై రాజకీయాలు కూడా బాగానే వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలతో చెబుతుండగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కరోనా నియంత్రణ చర్యలు, వైసీపీ నేతల తీరును ఎత్తిచూపుతూ సమర్థవంతంగా టీడీపీ తన గళాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుంచే కరోనా భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. ఇందుకు రాజకీయనాయకులు అతీతమేమీ కాదు. ఇక మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో చంద్రబాబు హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబం అంతా విజయవాడలోని కరకట్టను వీడి హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌కు వెళ్లారు. ఈ విషయంలో అధికార పక్షం నుంచి టీడీపీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇది టీడీపీకి కొన్ని ఇబ్బందులను మాత్రం తెచ్చిపెట్టింది. అయితే చంద్రబాబు మాత్రం జూమ్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచే పార్టీ నాయకులకు కార్యకర్తలకు జూమ్ మీటింగ్ ద్వారా దిశా నిర్దేశం చేసేవారు. దీన్నే అధికార వైసీపీ నాయకులు టార్గెట్‌గా చేసుకుని విమర్శలు సంధించారు. 

రాజధాని అమరావతి కోసం అదే ఉడుంపట్టు పోరాటం...?

ఈ ఏడాది ఆరంభంలో అంటే 1 జనవరి 2020లో తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను ప్రజలను కలిసి వారి ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. వద్దంటే జగన్‌కు ఓటు వేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని ఇప్పుడు రాష్ట్రాన్ని అదోగతికి తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి భిక్షాటన చేశారు. ఇలా అమరావతి కోసం ఈ ఏడాది అంతా నిరంతర పోరాటాలను టీడీపీ నిర్వహించింది. ఇది కూడా టీడీపీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. వైసీపీ అధికార వికేంద్రీకరణ పేరుతో టీడీపీ పోరాటాన్ని నియంత్రించే దిశగా అడుగులేసింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మినహా ఇతర జిల్లాలలో టీడీపీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. 



బీసీ అస్త్రం ప్రయోగంలో సఫలం....?

గత సార్వత్రిక ఎన్నికల్లో చేజారిన బీసీ ఓటు బ్యాంకుపై టీడీపీ దృష్టి సారించింది. బీసీ అంటే టీడీపీ అన్నట్లుగా ఉన్న ఆ వర్గ ఓటు బ్యాంకును గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకొంది. దీంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించుకొంది. ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన టీడీపీ నాయకత్వం తనకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన బీసీ ఓటు బ్యాంకు చేజారడం వల్లే ఈ ఘోర ఓటమి అని అంచనా వేసింది. ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు దాటకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నద్దమైన విషయం తెలిసిందే. దీనిపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. హైకోర్టు తీర్పును పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పదిశాతం రిజర్వేషన్లను బీసీలు కోల్పోవాల్సి వస్తుంది. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు నినాదిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కాస్త వెనకబడిన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్గిస్తున్నాయి. దీంతో బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో గత విధానం అమలు కోసం టీడీపీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రభుత్వం చేయని పనిని తాను చేయడం ద్వారా బీసీలకు దగ్గరవ్వాలన్న దిశగా టీడీపీ అడుగులేసింది. తమ రిజర్వేషన్లకు అండగా ఎవరు నిలబడితే వారికే బీసీలు కూడా జై కొట్టడం సహజం. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం దూకుడు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే అడుగులేసింది.


ప్రజా క్షేత్రంలోకి...?

పార్టీపై పట్టుకు లోకేష్ యత్నం.....అధికార పక్ష విమర్శలకు చెక్...?

గత ఎన్నికల్లో  పార్టీ ఘోర ఓటమితో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీని గట్టెక్కించే పనిలో తండ్రి, తనయుడు ఇద్దరూ నిమగ్నమయ్యారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నెంబర్ టూగా ప్రస్తుతం నారా లోకేష్ ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇటీవల టీడీపీ యువ నేతలతో, పార్టీ అనుబంధ విభాగాలతో నారా లోకేష్ తరచూ భేటీ అవుతున్నారు. అంతేకాకుండా కీలక నిర్ణయల సమయంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు పార్టీలోని సీనియర్ నేతలతోనూ నారా లోకేష్ కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దంతా పార్టీపై పట్టుకోసమే నారా లోకేష్ చేస్తున్నారని, పార్టీ అధినాయకత్వం ఆదేశం మేరకే ఇద్దంతా జరుగుతోందని సమాచారం. టీడీపీ నాయకత్వం విషయంలో అధికార పక్షం వైసీపీ గత కొన్నేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  

టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు నాయుడు వయస్సు పై బడిందని, ఇక తెలుగుదేశం పార్టీ దుకాణం మూసేస్తారని తరచూ ఆ పార్టీపై వైసీపీ నేతలు చేసే విమర్శ. టీడీపీలో నెంబర్ టూ నేత ఎవరూ అని కూడా వైసీపీ విమర్శలు ప్రధానంగా మారింది. దీంతో నారా లోకేష్ ను పార్టీలో నెంబర్ టూ నాయకత్వం దిశగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఆయన పార్టీలోని యువ నేతలతో, పార్టీ అనుబంధ సంఘాలతో తరచూ భేటీ అవుతున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో పార్టీకి చెందిన యువ నేతలకు దంపతులతో సహా భోజనానికి నారా లోకేష్ ఆహ్వానించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నా మెయిన్ అట్రాక్షన్ గా నారా లోకేష్ వ్యవహరించారు. యువ నేతలతో మాటా మంతి కొనసాగించారు. టీడీపీ అధికారంలోనున్న సమయంలో మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ కు ప్రజల్లోకి వెళ్లే అవకాశం తక్కువగా ఉండేది. ఒక వేళ వెళ్లిన ఓ మంత్రిగా వెళ్లారే గానీ ఓ నేతగా వెళ్లే అవకాశం మాత్రం ఆయనకు రాలేదు. అందుకే ఆయనకు పార్టీపై పట్టు అంతగా రాలేదని  టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ దూకుడు పెంచుతున్నారు. స్వతహాగా తానే జిల్లా, నియోజవర్గాలకు నారా లోకేష్ వెళ్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తంచేసేందుకు వీలుగా పార్టీ అనుబంధ విభాగాలను పూనర్ నిర్మాణం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీ యువత, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మికు వంటి అనుబంధ విభాగాల పునర్ నిర్మాణంపై నారా లోకేష్ స్వయంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇలా టీడీపీలో నారా లోకేష్ తన పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అరెస్టులతో...టీడీపీ ఉక్కిరి...బిక్కిరి...?....ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తమిళనాడు తరహా పరిణామాలు చోటుచేసుకొంటున్నాయా...? అక్కడి మాధిరిగా అధికార, ప్రధాన ప్రతిక్షం మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిణామాలు చోటుచేసుకోనున్నాయా...? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత 2019 ఎన్నికలకు ముందు నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. 2019 ఎన్నికల అనంతర పరిణామాలు ఏపీలో మరింత రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వ విధానాలను తిరగడోలుతున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పెద్ద ఎత్తున్న విమర్శలకు దిగుతోంది. ఇందులో భాగంగా అరెస్టుల పర్వం ఏపీలో మొదలైంది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కె.అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు వాహనాల విషయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జే.సీ.ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ధర్నాకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన్ని న్యాయస్థానం రిమాండ్ కు ఆదేశించింది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా టీడీపీలో అలజడి మొదలైంది. మొన్నటి వరకు పార్టీ నేతలు పార్టీని వీడటం టీడీపీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తే తాజాగా ఆ పార్టీ నేతల అరెస్టుల వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. దీంతో టీడీపీ నాయకత్వం మరింత ఆందోళనకు గురవుతోంది.  తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు తపుచేసిన వారిని వదిలేయాలా...వారు బీసీ అయితే నేరం చేసినా వదిలేయాలా అని వైసీపీ తరఫున ఆ పార్టీ బీసీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా ఏపీలో రాష్ట్ర రాజకీయాలు రసోత్తరంగా మారాయి.

ఏపీ రాష్ట్ర రాజకీయాలు కాస్త తమిళనాడు తరహా రూపుదిద్దుకొంటున్నాయా..? అసలు ఏపీలో ఏ జరుగుతోంది అన్నది ఓ సారి పరిశీలిస్తే తమిళనాడు రాజకీయాలు మనకు గుర్తుకు రాకమానదు. తమిళనాడులో ఒకప్పుడు. కరుణానిధి, జయలలిత మధ్య హోరాహోరీ పోరు నడిచేది. అది ఎన్నికల్లో మాత్రమే కాదు బయట కూడా. ఎవరు అధికారంలో ఉంటే.. వాళ్లు ఇతరులను మెంటల్‌గా టార్గెట్ చేశారు. కేసులు వేధింపులు ఓ రేంజ్‌లో ఉండేవి. వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు కాబట్టి తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. 2019 ఎన్నికల అనంతరం టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ ఫైట్ నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతోంది.

✍️ రచయిత-సయ్యద్ రహ్మత్

సెల్ నెం-7093951403