ఉపాధ్యాయులు... సమాజ నిర్మాతలు

ఐటా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యయులకు సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సమాజం అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనేగాక మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరని అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ముజఫ్ఫర్ అలీ షామీరీ అన్నారు. ఆదివారం ఛత్తాబజార్ లోని ఇస్లామిక్ సెంటర్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆలిండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయ సంస్థ(ఐటా) ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, శాలువాతో సత్కరించారు. దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతీ ఏటా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. దేశంలో విద్యాసంస్థల అభివృద్ధికి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

 

నేటి విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల బాధ్యతలపై షామీరీ ప్రసంగించారు. ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టేవారు తమ వృత్తిని ప్రేమించే లక్షణం ఎంతో అవసరమన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. మన విద్యావిధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో ఇనుమడింపజేయాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఐటా జాతీయ అధ్యక్షులు అన్వర్ ఖాన్ అన్నారు. ఉపాధ్యాయులు చక్కని విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఐటా స్టేట్ ప్రెసిడెంట్ ఖాలిద్ హుసైన్ ఖైసరీ అన్నారు. బోధనా ప్రమాణాలను పెంపొందించుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల పలు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ముహమ్మద్ గౌస్, మానూ ప్రొఫెసర్ ఆబిద్ మోయిజ్, ఐటా సెక్రటరీ మీర్ ముంతాజ్ అలీ, హైదరాబాద్ ఐటా నాయకడు ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: