ఓటరుగా నమోదు కావాలా...?

ఏపీలో...ఓటుహక్కు నమోదుకు అవకాశం

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట నమోదుకు అవకాశం కల్పించారు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోండి. పేరు లేకున్నా.. ఏమైనా సవరణలు ఉన్నా.. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయం, అన్ని పోలింగ్‌బూత్‌లలో ఓటరు జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకునే విధంగా అవకాశం కల్పించారు అధికారులు. పేర్లు తప్పుగా ఉన్నవారు, మార్పుల, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్త ఓటరు నమోదుకు డిసెంబర్‌ 15వరకు అవకాశం కల్పించింది. నియోజకవర్గం అధికారులు ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేశారు.

అర్హులకు అవకాశం

రాజ్యాంగం ప్రకారం 18ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2021 జనవరి 1వరకు 18ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.

ప్రత్యేక ప్రణాళిక

ఏటా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ ఏడాది కూడా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులు పోలింగ్‌ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21, 22తేదీలతో పాటు డిసెంబర్‌ 5, 6న ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకునే వీలుంటుంది. 2020 డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2021 జనవరి 5న దరఖాస్తులు పరిశీలించిన అనంతరం జనవరి 14న తొలి జాబితాను విడుదల చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: