సమానత్వంలో అసమానత్వం..

ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి.....!! 

రాజ్యాంగం అమలులో లోపాలు కోకోల్లలు!!

రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సెల్ ల నియామకం గురించి నియమావళి చాలా స్పష్టంగా ఉంటే, ఇక కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో అయితే అసలు నియమావళి అనేది లేదు. ఎవరికీ రాజకీయంగా పలుకుబడి ఉంటే వారే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియమింపబడతారంటే ఆశ్చర్యపరచక మానదు.  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ప్రతి హై కోర్టులో వుంటారు. ఈయన క్రింద ఒక 30 నుంచి 70 వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సెల్ ల ఉంటాయి. వాటిలో పోస్టల్ డిపార్ట్మెంట్, టొబాకో బోర్డు, కాఫీ బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, నేవీ, ఆర్మీ, మిలిటరీ, సి ఆర్ పి ఎఫ్, పాసుపోర్టు డిపార్ట్మెంట్, విదేశాంగ శాఖ, జాతీయ రహదారులు, విమానయాన శాఖ ఇలా మొత్తం ఎన్ని కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంటులు ఉన్నాయో, వాటన్నిటికి ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ప్రతి హై కోర్టులో వుంటారు. అయితే వీరి నియామకానికి సంబంధించి ఎటువంటి నియమావళి కానీ చట్టాలు కానీ లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆఫీస్ మెమొరాండంలో వీరి పదవి కాలపరిమితి 3 సంవత్సరాలు అని రాసి ఉంటుంది. అలా 2015 లో నియమింపబడ్డవారు ఇప్పటికి కొనసాగుతున్నారు. 

ఇక ఇదంతా ఒక విషయం అయితే చాలా మంది తెలంగాణా న్యాయవాదులు, హైద్రాబాదులో వుంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా చెలామణి అవుతున్నారు. వారిలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కౌన్సెల్, AICTE, NCTE, IOCL, HPCL, DRI,  NIA,  CBI , రైల్వే ఇలా చాలా డిపార్ట్మెంట్లలో చాలా మంది తెలంగాణ వారే ఉండటం విడ్డూరం. రాష్ట్రము విడిపోయినా తెలంగాణ వారిదే పైచేయి లాగా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం వీరిని ఎందుకు ఇంకా కొనసాగిస్తుందో వివరించాలి. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉదయమాలలో పాల్గొని, తెలంగాణ తరపున తెలంగాణ కోసం పని చేసారో, తెలంగాణాలో మాత్రమే కేంద్రం తరపున న్యాయవాదులుగా కొనసాగాలి. అంతేగాని, తెలంగాణాలోని హైద్రాబాదులో అన్ని రకాలుగా స్థిరపడిన న్యాయవాది, అమరావతిలో ప్రతి రోజు కోర్టుకి హాజరు కావడం ఎంత కష్టమో అర్థం చేసుకొని, ఆంధ్రలోని న్యాయవాదులకు వారు వట న్యాయంగా ఇవ్వాలి. అంతే కాకుండా, CAT (కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ను కూడా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని కూడా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి. రాష్ట్రము విడిపోయి 2 సంవత్సరాలు అవుతున్న, ఇంకా హైద్రాబాదులో వీటిని కొనసాగించాల్సిన అవసరం లేదు.   

రైల్వేలో స్టాండింగ్ కౌన్సెల్ నోటిఫికేషన్ 2017 లో ఇచ్చారు, అప్పట్లో అందరు సికింద్రాబాద్ రైల్ నిలయం వెళ్లి ఇచ్చి వచ్చారు. కానీ ఇంత వరకు ఫైనల్ చెయ్యలేదు. అలాగే, వేరే వేరే డిపార్ట్మెంట్స్ వారు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు ఫైనల్ చేస్తున్నారు అనే సమాచారం ఇవ్వకుండా, వారికీ నచ్చిన అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. ఇది సమానత్వానికి వ్యతిరేకం.

ఇదే కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటికన్నా మించి స్టాండింగ్ కౌన్సెల్ ను నియమించాల్సివస్తే కచ్చితంగా రిజర్వేషన్ పద్దతిని అమలు పరచాలి. నియమావళి లేకుంటే నియామకాలను ఎలా ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఒక సామాన్య మానవుడికి ఉన్నప్పుడు. అదే న్యాయస్థానంలో, న్యాయవాద నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంభించే తీరు చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబెర్ ను తీసుకు వచ్చి, ఆంధ్ర  హై కోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. ఈ నియామకం జరగడానికి ముఖ్యకారణం కులం, అదే ఏ చిన్న కులాలవారినో నియమించితే పెద్ద న్యాయపరమైన యుద్ధం కోర్టులో జరిగేది. కానీ, ఈ న్యాయవాది పెద్ద కులం వారు కావడం వలన, చాలా మంది మాకెందుకులే అనే పద్దతిని అవలంబించారు. ఇలా మాకెందుకులే అనుకుంటూ రావడం వలన, ఇప్పటివరకు జరిగినా అన్ని నియామకాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనేది నిజం. ఎందుకంటే, ఒక తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబెర్, ఇక్కడ ఆంధ్రాలో ఎలా నియమిస్తారో కేంద్రం వివరించాల్సి ఉంది. ఇలా, ఒకటి, రెండు కాదు, దరిదాపుగా ఒక 50 -70 మంది న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా 2015 నియమింపబడినప్పిటికి ఇప్పటికి చాలా మంది కొనసాగుతూనే ఉన్నారు. అందరు సమానమే అయితే, ఇదెలా సాధ్యం అనే ప్రశ్న రాక మానదు. మరి ఇక్కడే సమానత్వంలో అసమానత్వం కనపడేది. ఈ అసమానత అందరికి కనపడదు, ఎందుకంటే, కనపడిన, వారి ప్రశ్నించరు, మనకెందుకులే, మనం ప్రశ్నిస్తే మనకు ఇవ్వరు, వేరే ఎవరికో ఇస్తారు అనే ధోరణి. 

న్యాయవాదులు నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం సరైన నియమావళి తాయారు చెయ్యాలి. అంతే కాకుండా, ఒక నిర్ణీత కాల పరిమితికి మించి న్యాయవాదులు పని చెయ్యడానికి వీలు లేకుండా చెయ్యాలి, తద్వారా, వేరే వ్యక్తికి కూడా ప్రభుత్వం తరపున పని చేసే అవకాశం రావడానికి వీలు పడుతుంది. అంతే కానీ, ఒక వ్యక్తే ఇక శాశ్వతకాలం ప్రభుత్వ న్యాయవాదిగా ఉండటమనేది సమానత్వానికి, రాజ్యాంగంలో వివరించిన అధికరణ 14 మరియు 16 కు పూర్తి విరుద్ధం. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం న్యాయవాద నియమావళిని తీసుకు వచ్చి అందరికి అవకాశం వచ్చే విధంగా తాయారు చేయాలి. లేకపోతే, ప్రభుత్వానికి మరియు న్యాయవాదులకు చాలా నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక ప్రత్యేక సర్కులర్ ఇచ్చి, ఆయా సంస్థలు వారికీ సంబందించిన న్యాయవాదులను ఎంపిక చేసుకునేటప్పుడు, కచ్చితంగా రిజర్వేషన్ పాటించాలి అనే నిబంధనలను సూచించాలి. లేకపోతే, చాలా న్యాయవాదులు మరి ముఖ్యంగా 10 సంవత్సరాలనుండి వాళ్లే, వాళ్ళు మాత్రమే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. దీని అర్థం ఈ నియమితులైన వాళ్ళు మాత్రమే తెలివైన వారా, లేకపోతే వాళ్ళు పుట్టుకతోనే తెలివైనవారా, ఇంక ఎవరు తెలివైన వారి లేరా, మరి వాళ్ళు మాత్రమే పదవిలో ఎన్నాళ్లయినా కొనసాగ వచ్చా, ఇక ఇలా ఎన్నాళ్లయినా వాళ్ళు పదవిలో ఉంటే, అది రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వానికి విరుద్ధం కదా అనే విషయాన్నీ గుర్తించాలి. ఇక పోతే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులకు వయసు పరిమితి కూడా నిర్ణయించాలి, ఎందుకంటే జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్ గా కొంత మంది 55  సంవత్సరాలలో వస్తున్నారు. ఇక సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ అయితే 60  పై మాటే. ఇందుకు సంబంధించి సరైన నియమావళి తాయారు చేయకుంటే, రాబోయే తరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తులుగా ఎన్నుకోబడటానికి ముఖ్యంగా గవర్నమెంట్ ప్లీడర్లను, స్టాండింగ్ కౌన్సెల్ లను, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్ పేర్లను ప్రతిపాదిస్తారు. వారికి రాజ్యాంగం మరియు ఇతర చట్టాల అవగాహనా పరిజ్ఞానం, మిగిలిన అర్హతలు అన్ని చుసిన తరువాత వారి పేరును ప్రతిపాదిస్తారు. అయితే, ఇక్క ఎస్.సి, ఎస్.టి, బి.సి న్యాయవాదులను వారికీ రావాల్సిన గవర్నమెంట్ ప్లీడర్లను, స్టాండింగ్ కౌన్సెల్ లను, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్ పదవులు ఇవ్వకపోవడంవలన, వారిని మొదటి రౌండ్ లోనే ఆపేస్తున్నారు.  ఒకే వ్యక్తి ఒకే పదివికి దశాబ్దాల తరబడి అలంకరించి ఉండటం వలన, వేరే న్యాయవాదులు అవకాశాలను కోల్పోతున్నారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి.న్యాయవాదులు నామినేటెడ్ పదవులలో వారిని తీసుకోకపోవటంవలన, వారికి ఇంకా ఉన్నత పదవులలోకి వెళ్లే అవకాశం కోల్పోతున్నారు. ఇక ఒకే పదవిలో దశాబ్దాల తరబడి ఉన్న, ఈ బంక వీరులు (పదవికి బంక రాసుకుని దశాబ్దాలుగా ఉండటం వలన వాడిన పదం)  ఉన్నత పదవులలోకి వెళ్తున్నారు. న్యాయవాద జనాభా నిష్పత్తిలో చూసుకుంటే, ఎస్.సి, ఎస్.టి, బి.సి. జనాభా దరిదాపుగా 80 %  కానీ వీరికి ఇంత వరకు దక్కిన పదవులు 20 % మాత్రమే. ఇక వీరికి ఇచ్చే పదవులు కూడా యే కేసులు లేని డిపార్ట్మెంట్ మాత్రమే ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ వారు వీరికి ఇచ్చే ఫీజులు కూడా చాలా తక్కువే. గత 75  సంవత్సరాలలో ఎంత మందికి సరైన పదవులు ఇచ్చారు అనే ప్రశ్నకు కూడా మనకు సరైన జవాబు రాదు. ఇక ఇలాగే కొనసాగితే ఇంకో 100  సంవత్సరాలైనా ఎస్.సి, ఎస్.టి, బి.సి న్యాయవాదుల పరిస్థితులు మారతాయని ఊహించలేము.

కేంద్ర లా మినిస్టర్ శ్రీ రవి శంకర్ ప్రసాద్ ఈ మధ్య ఒక ప్రకటన చేసారు, అది ఏమని అంటే, ఉన్నత న్యాయవ్యవస్థలో సరియైన నిష్పత్తిలో ఎస్.సి, ఎస్.టి, బి.సి. న్యాయమూర్తులను ఎన్నుకోవాలని చెప్పారు. ఒక కేంద్ర మంత్రి ఈ ప్రకటన చెయ్యాల్సి వచ్చిందంటే, ఇక పరిస్థితి ఎంత వరకు వెళ్ళింది అనేది అర్థం చేసుకోవాలి. 2020 నాటికి మొత్తం భారత దేశంలో హై కోర్టులలో ఉన్న ఉన్నత న్యాయమూర్తుల సంఖ్య 1079, వీరు కాకుండా 30  మంది సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు ఉన్నారు. ఇక వీరిలో 771 శాశ్వత న్యాయమూర్తులు మరియు 308 మంది అదనపు న్యాయమూర్తులు. అయితే దరిదాపుగా 37% ఉన్నత న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి, అంటే దరిదాపుట 400 ఉన్నత న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ 400 ఖాళీలను పూరించితే ఎంత మంది ఎస్.సి, ఎస్.టి, బి.సి లకు అవకాశాలు వస్తాయో వేచి చూడాలి. న్యాయమూర్తుల ఎంపికలో సామజిక న్యాయం జరగకపోయినా అసమానత్వం ఉన్నట్టే లెక్క. ఇక మహిళా న్యాయమూర్తులు కూడా తక్కువగా ఉన్నారు. ఇలా ఉంటే సామాన్య మానవుడికి న్యాయం జరగడానికి ఖచ్చితంగా చాలా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఆలస్యమైనా న్యాయం, అన్యాయంతో సమానం.  అందరు సమానమే అనే రాజ్యాంగాన్ని న్యాయవాదిగా ప్రతి రోజు చేత పట్టి, ఇక వేరే వారికీ తావు లేకుండా ఒకరే పదివిని అలంకరించి కుర్చున్నారంటే, సమానత్వంలో అసమానత్వం ఉన్నట్టే లెక్క. ఈ తప్పులను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరి చేస్తుందని ఆశిద్దాం.   

✍️ రచయిత-సోల్మన్ రాజు మంచాల

హైకోర్టు న్యాయవాది

ఫోన్:  8897960016 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: