మ్యానిఫెస్టోలకు...చట్టబద్ధత కల్పించాలి

అపుడే ప్రజాస్వామ్యం విజయం



నవరత్నాల మ్యానిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నారు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల వాగ్దానాలు సకాలంలో  అమలు అవుతుంటే ఓటర్లు నాయక వశం, పార్టీ వశం అవుతారు. ఎందుకంటే మ్యానిఫెస్టో  అంటే తాము పరిపాలనలోకి వస్తే ప్రజలకు ఏమేమి పనులు చేస్తామో చెప్పే  ప్రణాళిక అన్నమాట. 17 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన అనుభవం మనది.

రాజకీయ విద్యాగంధం అందించే ఎన్నికల మ్యానిఫెస్టోలు

ఎన్నికల  మ్యానిఫెస్టోలు ప్రజలకు రాజకీయ విద్యాగంధం అందిస్తాయని అద్వానీ  అన్నారు. పేదరిక నిర్మూలన వంటి పడిగట్టు వాగ్దానాలతో ఉచిత వాగ్దానాల ఎరలతో  ఓటర్లను బురిడీ కొట్టిస్తారని మ్యానిఫెస్టోలను ప్రజలు పట్టించుకోవటమే  లేదు. ఎన్నికల మేనిఫెస్టో రాజకీయ వాగ్దానాల పట్టిక. పార్టీల దూరదృష్టికి  ప్రతీక. ప్రజలు అది ఆచరణసాధ్యం కాని వాగ్దానాల జాబితా చిట్టాగా  అనుకొంటున్నారు. పార్టీల మ్యానిఫెస్టోల అమలును పరిశీలించడం ఎన్నికల  సంఘానికి బాధ్యతగాలేదు. ఎన్నికల వాగ్దానాల అమలుకు కట్టుబడేలా పార్టీలను  ఆదేశించలేమంటూ సుప్రీం కోర్టే నిస్సహాయత వెలిబుచ్చింది. సీఈసీగా శేషన్‌  తరువాత పార్టీలు ప్రజలు మ్యానిఫెస్టోల విలువను గుర్తించలేదు.


 

అమెరికాలో 2 నెల‌ల‌ముందే మ్యానిఫెస్టో విడుద‌ల‌

అమెరికాలో  రెండు నెలలు, మెక్సికోలో అయిదునెలల ముందే మ్యానిఫెస్టోలు వెలువడతాయి. 2014  సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్‌ తేదీనాడే భాజపా మ్యానిఫెస్టో విడుదల  చేసింది.  మ్యానిఫెస్టోలపై జన బాహుళ్యంలో సరైన చర్చ జరగటంలేదు. ఓట్లకోసం  ప్రజల అవసరాలను తీరుస్తామని ప్రకటించే పార్టీలు మ్యానిఫెస్టోలను కూరలో  కరివేపాకుగా మార్చేశాయి. నిరుద్యోగ భయం మన దేశాన్ని వెంటాడుతోంది. కోవిడ్‌  లాక్‌డౌన్‌ అనంతరం లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సరైన  ఆదాయం లేక తగిన వైద్యం కూడా పొందలేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి.

పెరిగిన రోజుకూలీల ఆత్మహత్యలు

ఇదే సమయంలో చిన్నారులను పాఠశాలలకు పంపలేక, కుటుంబానికి అవసరమైన ఆహారంపై  వ్యయం కూడా చేయలేక రోజువారీ కూలీల ఆత్యహత్యల రేటు కూడా పెరిగింది. లక్షలాది  ఉద్యోగ ఖాళీలను సర్కార్‌ భర్తీ చేయడం లేదు.ఉద్యోగాల కల్పన , నిరుద్యోగ  భృతి హామీ ప్రతిరాష్ట్రంలో ఇస్తున్నారు. అవినీతి గడ్డి- నేను తినను,  తిననివ్వను అన్న మోదీ, స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద  అవరోధంగా మారిందని అన్నారు. ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరా, నకిలీ  నగదు చలామణి, ఉగ్రవాద నిధులు కలిసి పని చేస్తున్నాయట. 180 దేశాల అవినీతి  సూచీలో ఇండియా 80వ స్థానంలో ఉంది. అవినీతి కేసుల్లో సత్వరం సరైన శిక్షలు  పడటం లేదు. రాజకీయ అవినీతి పెరిగిపోయింది. విజిలెన్స్‌ కార్యాలయాలు తపాలా  పనికే పరిమితమవుతున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.


 

న‌గ‌దు అక్ర‌మ ప్ర‌వాహానికి అడ్డుక‌ట్టేది...?

కాలం  చెల్లిన చాలా పాత చట్టాలను రద్దుచేశారు కానీ ఎన్నికల్లో అక్రమ నగదు  ప్రవాహాల్ని ఆపలేకపోతున్నారు. ఎన్నికల్లో నల్లధనం స్వేచ్ఛగా ప్రవహించి,   సంపన్నుల మాటే చెల్లుబాటవుతోంది. రాజకీయ నిధుల సేకరణలో పారదర్శకత లేదు.  ఎన్నికల వ్యయానికి పార్టీలు పోటీపడుతున్నాయి. అవినీతి సంపాదనే ఎన్నికల  పెట్టుబడిగా మారుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా లక్షలాది ఉద్యోగాలు  ఇస్తామంటున్నాయి. కరోనా టీకా ఉచితమని వాగ్దానం చేశాయి. రాజకీయ పార్టీలు  ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా  నిర్వహించాలన్న స్ఫూర్తిని దెబ్బతీయడమేనని సుప్రీంకోర్టు  వ్యాఖ్యానించింది.

జీవించే హక్కు, ఆహారహక్కు, భద్రతహక్కు

మన దేశంలో పోలియో లాంటి 12 రకాల వ్యాక్సిన్‌లు ఉచితంగానే ఇస్తున్నారు.  సంక్షేమ రాజ్యం కోసం కరోనా వ్యాక్సిన్‌ కూడా ఉచితంగానే ఇవ్వాలి . మన  ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు మారాలి. కూలీలకు జీవించే  హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు కావాలి. శ్రమను గౌరవించాలి. కరోనా వ్యాధి  తొలి దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలు నడిచి పోతున్న భయానకమైన  దృశ్యాలు చూశాం. పట్టణాలలోని భవన నిర్మాణ స్థలాల్లో ఇటుకబట్టీల్లో వ్యవసాయ  క్షేత్రాల్లో పనిచేసే వలస కూలీలు కార్మికులు బస్సులు రైళ్ళులేక స్వస్థలాలకు  కాలినడకనే ప్రయాణమయ్యారు.

వలసల వెనుక వ్యథ గుర్తించాలి

వివిధ ప్రాంతాలకు కోట్లమంది వలస వెళతారు. ఈ వలసలకు కారణాలు ఏంటి? ఆకలి  బాధ ఉపాధి లేమి. జీవనం గడపడంకోసం, మనుగడకోసం పోరాటం . దేశంలో 3 కోట్ల  వ్యాపార సంస్థలలో 21 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులను  తొలగించకపోతే ఎక్కడికీ వెళ్లరు. లే ఆఫ్‌లు,రిట్రెంచ్ మెంట్ల వల్ల  ఉద్యోగాలు దొరికే చోటికి వెళుతున్నారు. కరోనా లాక్‌ డౌన్‌. కోట్లాది మంది  వలస కార్మికుల జీవితాలను దెబ్బ తీసింది. నగరాల నుంచి భారీస్థాయిలో వలస  కార్మికులు తిరుగుముఖం పట్టారు. చాలామంది చనిపోయారు. ఇంతమందికి ఉపాధి  పునరుద్ధరణ కష్టమే. తమ ప్రాంతాల్లో పనులు దొరకని,పనుల కోసం ఎదురు చూస్తున్న  కూలీలు అధిక సంఖ్యలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. వలస కార్మికులను భారీగా  ఇముడ్చుకునే నిర్మాణం రంగం పుంజుకోవాలి.

పాఠ‌శాల‌లు తెరిచిన రాష్ట్రాల్లో పెరిగిన కేసులు

అనేక  జాగ్రత్తలు తీసుకుని దశలవారీగా పాఠశాలల్ని తిరిగి తెరవడానికి సంసిద్ధమైన  రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా  కొవిడ్‌ సోకింది కాబట్టే ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా,  పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జంకుతున్నాయి. విద్యను చట్టబద్ధ హక్కుగా  నిర్ధారించిన దేశం మనది. రోగ లక్షణాలు వ్యక్తంకాని విద్యార్థులతో  సన్నిహితంగా మెలగిన పిల్లల ద్వారా తోబుట్టువులకు, వృద్ధులకు కొవిడ్‌  సోకవచ్చు. దేశంలో 32లక్షల స్వచ్ఛంద సంస్థలున్నాయి. ఇవి హెచ్‌ఐవీ వంటి  వ్యాధుల నియంత్రణ, దళితులు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ  గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందిస్తూ నిరుపేదలకు అండగా ఉన్నాయి.  పార్టీలు విడుదల చేస్తున్న ఎన్నికల ప్రణాళికలలో చర్విత చర్వణంగా మునుపటి  వాగ్దానాలే ఉంటున్నాయి. మునుపటి ఎన్నికలలో చేసిన వాగ్దానాలను ఏ మేరకు అమలు  చేశారో తెలుసుకోవాలి. జీవనోపాధి కల్పన హామీ అమలుకు గెలిచిన పార్టీలు  కట్టుబడి కృషి చెయ్యాలి. అత్యంత ధనికులైన వారి మీద అదనపు పన్ను విధిస్తామని  సమాజ్ వాదీ పార్టీ ప్రణాళికలో ప్రతిపాదించింది.

హామీల‌ను మ‌రిచిపోతున్న పార్టీలు

రాజకీయం  అంతా పేదల చుట్టూనే రకరకాల హామీలు ఇచ్చి ఎన్నికలు ముగిశాక ఆ హామీలను  మరచిపోతున్నారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు పార్టీలను జవాబుదారీ  చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ ఆనాడే అన్నారు.  పార్టీల మేనిఫెస్టోలన్నీ అమలుకు నోచుకోని చిట్టాలుగానే మిగిలిపోతే ఏమి  లాభం? పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలకు విలువ ఇవ్వకపోతే అడిగే వాళ్లేరి?  ఎన్నికల హామీలకు చట్టబద్ధత ఏది? ఎన్నికల ప్రణాళికల మీద ఆడిట్‌ ఏది? మాట  తప్పిన పార్టీలను నిలదీసే ఏర్పాట్లు ఏవి? అన్నీ ఉచితంగా ఇచ్చేస్తారా?  మేనిఫెస్టోలలో అమలుకు సాధ్యంకాని వాగ్దానాలు ఎందుకు? తాగునీరు, ఆహారం,  ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చటానికి ఖర్చు ఎంత  అవుతుంది?ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలియకుండా ప్రజలకు అరచేతిలో  వైకుంఠం చూపితే ఎలా?

ఏరు దాటాక తెప్ప తగలేసే పార్టీలు

ఎన్నికల మేనిఫెస్టోలకు చట్టబద్ధత కల్పింఛాలి.ఏరుదాటాక తెప్ప తగలేసే  పార్టీలకు ముకుతాడు వెయ్యాలి. మేనిఫెస్టోల్లో హామీలకు తాము బాధ్యత  వహిస్తామంటూ పార్టీలు కోర్టు ప్రమాణపత్రం జత చేయాలి.ఎన్నికల వాగ్దానాల  అమలుకు పార్టీలనే బాధ్యులను చేయాలి. ఎప్పటిలోగా వాటిని అమలు చేస్తారో  పార్టీలు చెప్పాలి. పార్టీలు ఎన్నికల సంఘం ఆమోదం తీసుకున్నాకే హామీలు  ఇవ్వాలి. అప్పుడు అసాధ్యమైన హామీలు గుప్పించే వ్యక్తులు, పార్టీలు వెనక్కు  తగ్గుతారు. అమలులో విఫలమైన పార్టీలను కొన్నేళ్లు నిషేధించాలి.క్రిమినల్‌  కేసుల్లో శిక్షలు ఖరారైన ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు అనర్హులవుతారు.అలాగే  మాటతప్పిన పార్టీలను బోనులో నిలబెట్టాలి.

✍️ రచయిత-నూర్ బాషా రహంతుల్లా

విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్

సెల్ నెం-6301493266

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: