నవంబర్‌ 26 సార్వత్రిక సమ్మె, 

నవంబర్‌ 27న జరుగు నిరసనలను జయప్రదం చేయండి

ఏఐకెఎస్‌సిసి పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

నవంబర్‌ 26 సార్వత్రిక సమ్మె, నవంబర్‌ 27న జరుగు నిరసనలను జయప్రదం చేయాలని ఏఐకెఎస్‌సిసి పిలుపు నిచ్చింది. హైదరాబాద్‌ హిమయత్‌ నగర్‌లోని మఖ్దుం భవన్‌లోని నవంబర్‌ 24న జరిగిన ఏఐకెఎస్‌సిసి ప్రెస్‌మీట్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ, ఏఐకెఎస్‌సిసి కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, అఖిల భారత కిసాన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పల్లపు ఉపేంధర్‌రెడ్డి మాట్లాడుతూ... నవంబర్‌ 26న జరుగు గ్రామీణబంద్‌, సార్వత్రిక సమ్మె, నవంబర్‌ 27న జరుగు నిరసనలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం తెచ్చిన 3 చట్టాల వలన కార్పోరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది.
దీనితో అదానీ, రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయి, చిన్న రైతులు క్రమంగా వ్యవసాయం వదులుకోవలసి వస్తుంది. పంటలు నిల్వ చేసుకోటానికి రైతులకున్న హక్కును కాజేస్తూ, గోదాములను, శీతల గిడ్డంగులను కార్పోరేట్‌ సంస్థలకు ఈ మూడు చట్టాల వల్ల అందుబాటులోకి తెచ్చింది. ఆహార నిల్వలపై కార్పోరేట్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది. దీనితో బ్లాక్‌ మార్కెట్‌ చేసి అధిక లాభాలు సంపాదించటానికి కార్పోరేట్లకు మార్గం సుగమం చేసింది. కొత్త చట్టం ప్రకారం మార్కెట్లన్ని ప్రైవేట్‌ యాజమాన్యంలోకి వెళ్లిపోతాయి. కేంద్రం తెచ్చిన 3 కార్పోరేట్‌ వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలి. విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. పార్లమెంట్‌లో పెట్టిన కనీస మద్దతు ధర, రుణ విమోచన బిల్లులను అమోదించాలి. రాష్ట్రాల అవసరాల మేరకు వ్యవసాయోత్పత్తుల ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. మిగులు ఉత్పత్తులు జరిగినచో ఎగుమతులను నియంత్రించి స్థానిక ఉత్పత్తులకు ధరలు నష్టపోకుండా చూడాలి. దిగుమతి సుంకాలను వేసి వ్యవసాయోత్పత్తులకు రక్షణ కల్పించాలి. మన మిగులు ఉత్పత్తులను (పసుపు, మిరప, పంచదార, పత్తి) ప్రాసెస్‌ చేసి అవసరమైన దేశాలకు ఎగుమతులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సబ్సిడీలు (ఇతర దేశాల లాగా) ఇవ్వాలి. ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచి, 200 రోజులు పని దినాలు కల్పించాలి. రోజు కూలీ రూ.600 ఇవ్వాలి. ఆహార భద్రత చట్టాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రద్దు చేయకుండా రైతులకు రక్షణ కల్పించే సంస్థలుగా చట్టాలు చేసి తీర్చి దిద్దాలి. వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి. అన్ని పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.2,500లు ఇవ్వాలి. నవంబర్‌ 26, 27 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని ఆటంక పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని అన్నారు. నిర్భందాన్ని ప్రయోగించడం ద్వారా రైతుల ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వామపాక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు నిచ్చాయని వారికి ఏఐకెఎస్‌సిసి ధన్యవాదాలు తెలియజేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పోరాటానికి మద్దతునిచ్చి ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: