నవంబర్ 26న గ్రామీణ బంద్, సార్వత్రిక సమ్మె
నవంబర్ 27న కేంద్ర కార్యాలయాల ముందు జరుగు నిరసనలు
బిజెపి వ్యతిరేక పార్టీలన్ని మద్దతు నివ్వాలి.
ప్రజా సంఘాల పిలుపు
(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి)
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 22న జరిగిన పజా సంఘాల ప్రెస్‌మీట్‌లో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు మాట్లాడుతూ... నవంబర్ 26న జరుగు గ్రామీణబంద్, సార్వత్రిక సమ్మె, నవంబర్ 27న కేంద్ర కార్యాలయాల ముందు జరుగు నిరసనలో బిజెపి వ్యతిరేక పార్టీలన్ని భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం తెచ్చిన 3 చట్టాల వలన కార్పోరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దీనితో అదానీ, రిలయన్స్ వంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయి, చిన్న రైతులు క్రమంగా వ్యవసాయం వదులుకోవలసి వస్తుంది. పంటలు నిల్వ చేసుకోటానికి రైతులకున్న హక్కును కాజేస్తూ, గోదాములను, శీతల గిడ్డంగులను కార్పోరేట్ సంస్థలకు ఈ మూడు చట్టాల వల్ల అందుబాటులోకి తెచ్చింది. ఆహార నిల్వలపై కార్పోరేట్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది. దీనితో బ్లాక్ మార్కెట్ చేసి అధిక లాభాలు సంపాదించటానికి కార్పోరేట్లకు మార్గం సుగమం చేసింది. కొత్త చట్టం ప్రకారం మార్కెట్లన్ని ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం మార్కెట్‌లలో ఉన్న సిబ్బందికి ఒక శాతం మార్కెట్ ఫీజు ద్వారా వేతనాలు ఇచ్చే విధానం రద్దు అవుతుంది. జిల్లాల్లోని మార్కెట్ యార్డుల్లో పనిచేసే అధికారులందరికీ వేతనాలు ఇవ్వడమేకాక ఏటా రూ.340 కోట్ల నిల్వ ఆదాయం మార్కెట్లకు వస్తున్నది. ఈ ఆదాయం కూడా దెబ్బతినిపోతుంది. 29 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి కార్మికులు అనేక త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న హక్కులను నీరుగార్చేందుకు పూనుకున్నది.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, మాట్లాడుతూ...కేంద్రం తెచ్చిన 3 కార్పోరేట్ వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలి. విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. పార్లమెంట్‌లో పెట్టిన కనీస మద్దతు ధర, రుణ విమోచన బిల్లులను అమోదించాలి. రాష్ట్రాల అవసరాల మేరకు వ్యవసాయోత్పత్తుల ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. మిగులు ఉత్పత్తులు జరిగినచో ఎగుమతులను నియంత్రించి స్థానిక ఉత్పత్తులకు ధరలు నష్టపోకుండా చూడాలి. దిగుమతి సుంకాలను వేసి వ్యవసాయోత్పత్తులకు రక్షణ కల్పించాలి. మన మిగులు ఉత్పత్తులను (పసుపు, మిరప, పంచదార, పత్తి) ప్రాసెస్ చేసి అవసరమైన దేశాలకు ఎగుమతులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సబ్సిడీలు (ఇతర దేశాల లాగా) ఇవ్వాలి. ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచి, 200 రోజులు పని దినాలు కల్పించాలి. రోజు కూలీ రూ.600 ఇవ్వాలి. ఆహార భద్రత చట్టాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయకుండా రైతులకు రక్షణ కల్పించే సంస్థలుగా చట్టాలు చేసి తీర్చి దిద్దాలి. వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి. అన్ని పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.2,500లు ఇవ్వాలి.
నవంబర్ 26వ తేదీన గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జాతాలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, గ్రూపు మీటింగ్‌లు, బహిరంగ సభల్లో వేలాదిగా పాల్గొనాలని కోరారు. తెలంగాణలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, చేతివృత్తుల వారు ఐక్యంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. 26వ తేదీన జరుగు కార్మిక సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ విజయవంతం చేద్దాం. నవంబర్ 27న జరిగే కేంద్ర కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థ సారథి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, డిఐవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం నాయక్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గీత కార్మిక సంఘం కార్యదర్శి రమణ, గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీంధర్, ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, పిఎన్‌యం రాష్ట్ర కార్యదర్శి నర్సింహ్మా, డివైఎఫ్‌ఐ నాయకులు ఏ. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: