విరాళాలలో అజతవాసులు
పార్టీలపై పెద్ద ఎత్తున్న విరాళాల జల్లు
రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో వీరి నుంచే విరాళాలు
దీనికి ఊతమిచ్చేలా బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలు
వీరినుంచే బీజేపీకి 90వాతం నిధులు
అన్ని రకాల విరాళాలలో బీజేపీదే పై చెయ్యి
బీజేపీకి బహుదూరంలో హస్తం పార్టీ
అయినా రెండో స్థానంలో కాంగ్రెస్
నల్లధనం వెలికితీత సంగతి ఏమిటీ...?
విరాళాలలో ప్రాంతీయ పార్టీల హవా
తొలిస్థానంలో వైసీపీ, రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్
ఆ తరువాత స్థానాల్లో టీడీపీ, టీఆర్ఎస్

మన భారత దేశం వేగంగా పురోగతి సాధిస్తున్న దేశంలోని పేదోడి కష్టాలు తీరడంలేదు. కారణం సంపద ఒకరి చేతిలో కేంద్రీక`తం కావడం. మరి మన భారతదేశం పురోగతి సాధించినట్లా లేక దేశంలోని కొందరు మాత్రమే అమాంతంగా ధనవంతులైనట్లా...? మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలో ధన వ్యవస్థ పూర్తిగా రూపుమాపినపుడే ప్రజా సంక్షేమ ప్రభుత్వం వస్తుంది. అలా కాకుండా ధన ప్రవాహంతో గెలిచి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ముమ్మాటికి కార్పోరేట్ కంపెనీలకు దాసోహంగా పనిచేస్తోంది. ఈ కారణం చేతనే మన భారతదేశం వేగంగా పురోగతి సాధించినా ఆ ఫలాలు అందడంలో ఎన్నో తారతమ్యాలు నెలకొన్నాయి. ఇదిలావుంటే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.6,405.59కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు ప్రజాస్వామ్య సంస్కరణలవేదిక (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. మొత్తం రాజకీయ పార్టీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఐఎన్ ఎల్ డీలుమాత్రమే తాము ఎలాంటి నిధులూ వసూలుచేయలేదని, పైసాకూడా ఖర్చుపెట్టలేదని చెప్పాయి. జాతీయపార్టీలు తాము వసూలుచేసిన మొత్తంలో 36.16% మాత్రమే ఎన్నికల కోసం ఖర్చుపెడితే, ప్రాంతీయ పార్టీలు 68% ఖర్చు చేసినట్లు ఏడీఆర్ వెల్లడించింది. బీజేపీకి గరిష్ఠంగా రూ.4,057.40 కోట్ల విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ కు రూ.1,167.14 కోట్ల్లు, వైసీపీకి రూ.221.58 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు రూ.141.09 కోట్లు, తెలుగుదేశానికి రూ.131.33 కోట్లు, టీఆర్ఎస్ కు రూ.129.26 విరాళాలు దక్కాయి. అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ, టీఆర్ఎస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వచ్చిన విరాళాల్లో బీజేపీకి రూ.1,141.72 కోట్లు, కాంగ్రెస్ రూ.626 కోట్లు, వైసీపీ రూ.85 కోట్లు, టీడీపీ రూ.79.26 కోట్లు, టీఆర్ఎస్ రూ.9.15 కోట్లు వ్యయం చేశాయి. అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ రెండోస్థానంలో, టీడీపీ 4, టీఆర్ఎస్ 9వ స్థానంలో నిలిచాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం. దేశంలోని పార్టీలకు పెద్ద ఎత్తున్న విరాళాలు అందుతున్నాయని, అందులో బీజేపీ తొలిస్థానంలో నిలిచిందని నివేదికలు తేల్చిచెబుతున్నాయి. అందులోనూ దేశంలోని రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలలో గుర్తు తెలియని వ్యక్తులు విరాళాలే అధికమని తేలతేటమైంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అదే విరాళాలలోనూ బీజేపీ దే పై చెయ్యి.
విరాళాలలో ఎవరిది పై చెయ్యి....?
రాజకీయపార్టీలకు అందుతున్న విరాళాల్లో సగం ‘గుర్తు తెలియని’ దాతలవేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఇటీవలి నివేదికలో వాపోయింది. మన దేశంలో విరాళాల ప్రక్రియ ఎంత లోపభూయిష్టమైనదో ఈ నివేదిక మారోమారు తెలియచెప్పింది. దేశంలోని వివిధ పార్టీలను పరిశీలిస్తే వారికి వచ్చిన నిధుల్లో 69 శాతం తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవేనని ఏడీఆర్ 2017లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వేర్వేరు మార్గాల్లో ఆరు రాజకీయపార్టీలు అందుకున్న రూ.1293కోట్లల్లో 689 కోట్లు గుప్త నిధులే. ఇందులో సింహభాగం అంటే రూ.1027కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళకాలంలో బీజేపీ ఆదాయం దాదాపుగా రెట్టింపైతే, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. మిగతా పార్టీలన్నీ బీజేపీకి ఆమడదూరంలో ఉన్నాయి. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా 2018వ ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మిగతా ఐదుపార్టీల సగటుకంటే నాలుగురెట్లు అధికంగా గుప్త నిధులను అందుకున్నది. 20వేల లోపు విరాళాలకు, ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన సొమ్ముకు పార్టీలు దాతల వివరాలు బయటకు చెప్పనక్కరలేదు. కనుక నిధుల్లో సగానికిపైగా ఈ కోటాలో పోతున్నాయి. అధికారంలో ఉన్నది కనుక 2013–14లో రూ.674కోట్ల ఆదాయం ఉన్న బీజేపీ 2017–18 కాలానికి 1027కోట్లకు పెరగడం, ఇదే కాలంలో అధికారంలో లేని కాంగ్రెస్ ఆదాయం 598కోట్లనుంచి రూ.199కోట్లకు పడిపోవడం సహజం. 2017–18 కాలానికి ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలకు సమకూరిన 215కోట్లలో సైతం బీజేపీదే అగ్రస్థానం. బ్యాంకులు జారీ చేసిన బాండ్లలో 95శాతం దాని పేరిటే దాతలు రాసిచ్చేశారు. పారిశ్రామిక పెద్దలు, కార్పొరేట్ సంస్థలు ఎలక్టొరల్ ట్రస్టుద్వారా ఇస్తున్న విరాళాల్లోనూ బీజేపీదే పైచేయి. దీనిద్వారా రూ.194కోట్ల విరాళాలు అందితే వాటిలో అధికశాతం బీజేపీకే దక్కాయి. కాంగ్రెస్‌కు పదికోట్లే వచ్చాయి. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి.
రాజకీయ పార్టీలకు సమకూరుతున్న ఆదాయంలో సగానికి పైగా ఆదాయం గుర్తుతెలియని వనరుల (అన్‌నోన్ సోర్సెస్) నుంచి సమకూరుతోందని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. రాజకీయ పార్టీలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఏడీఆర్ తాజా నివేదిక వెల్లడి చేసింది. ఏడు జాతీయ పార్టీలు అనగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్‌లు తమ ఆదాయ పన్ను రిటర్నులను ఈసీకి సమర్పించాయి. అయితే సీపీఎం తన రిటర్న్ ల్లో అనుబంధ వివరాలు లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన గుర్తుతెలియని వనరుల ఆదాయాన్ని విశ్లేషించటం సాధ్యం కాలేదని ఏడీఆర్ పేర్కొంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, సీపీఎం మినహా మిగతా ఆరు జాతీయ రాజకీయ పార్టీలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,293.05 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిటర్ప్ ల్లో చూపాయి. ఈ మొత్తంలో గుర్తు తెలియని వనరుల ఆదాయం రూ. 689.44 కోట్లుగా పేర్కొన్నాయి. అందులో రూ. 553.38 కోట్లు (80 శాతం) ఒక్క బీజేపీదేనని వెల్లడించింది. అంటే, మిగతా ఐదు పార్టీలకన్నా బీజేపీకి లభించిన గుర్తుతెలియని వనరుల ఆదాయం నాలుగు రెట్లు అధికంగా ఉంది. గుర్తు తెలియని వనరుల ఆదాయాలు కాంగ్రెస్ పార్టీకి రూ. 119.91 కోట్లు, బీఎస్‌పీకి రూ. 10.67 కోట్లు, ఎన్‌సీపీకి రూ. 5.37 కోట్లుగా ఉన్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్ రూ. 10.4 లక్షలు, సీపీఐ రూ. 30,000 గుర్తు తెలియని వనరుల ఆదాయాలుగా చూపాయి. ఇదిలావుంటే.. 2004-05 నుంచి 2017-18 మధ్య ఈ జాతీయ పార్టీలు రూ. 8,721 కోట్లు గుర్తు తెలియని వనరుల ద్వారా సేకరించాయని ఏడీఆర్ లెక్కగట్టింది. ఈ గుర్తుతెలియని వనరుల ద్వారా లభించే ఆదాయం ఏ రూపంలో లభించింది - నగదు రూపంలోనా, చెక్కులు తదితర రూపాల్లోనా - అనే వివరాలూ లేవు.

విదేశాల్లో అయితే...?
అమెరికా, యూరప్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, భూటాన్, నేపాల్ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఈ దేశాల్లో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే పూర్తి వివరాలు బహిర్గతం చేస్తున్నాయని సమాచారం. దీంతో ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు.
నల్లధనం వెలికితీత గాలికిపోయే...ఈ నల్లధనం సంగతేమిటీ...?
దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.
చట్టంలో లొసుగులకు తెరలేపిన బీజేపీ...?
ఇప్పుడు దీనస్థితిలో ఉన్న పార్టీలు సైతం రేపు ఎన్నికల్లో నెగ్గితే భూరి విరాళాలు అందుకుంటాయి. మనదేశంలో పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో చేసే ఖర్చుపై పరిమితి ఉన్నదే కానీ, రాజకీయపార్టీపై లేదు. పార్టీ విరాళాలపై పరిమితి విధిద్దామని ఇటీవల ఎన్నికల సంఘం అంటే, బీజేపీ ఈ ప్రతిపాదనను కొట్టిపారేసింది. 2017లో బీజేపీ హడావుడిగా 2013నాటి కంపెనీల చట్టాన్ని మార్చి కార్పొరేట్ విరాళాల ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తే, ఈ ఫైనాన్స్‌బిల్లును అన్ని పార్టీలూ ముక్తకంఠంతో ఆమోదించి సహకరించాయి. కార్పరేట్ సంస్థలు నికరలాభంలో ఏడున్నరశాతం మించి విరాళాలు ఇవ్వకూడదన్న నిబంధన తొలగిపోయి, ఇచ్చిన విరాళాలను సైతం తమ పద్దుల్లో చూపనక్కరలేని స్వేచ్ఛ వాటికి దక్కింది. ఇప్పటికే పెరటిదోవన అందుకున్న నల్లధనాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి 20వేల రూపాయల లోపు విరాళంగా రాజకీయపార్టీలు పద్దుల్లో రాసిపారేస్తున్నాయి. ఎలక్టొరల్ బాండ్స్ పరిస్థితిని మార్చకపోగా, దాతకూ, స్వీకర్తకూ, ప్రజలకూ మధ్యన అనేక ఇనపతెరలు కట్టి, రహస్య విరాళాలకు రెడ్‌కార్పెట్ పరిచింది. ఇప్పుడు వెయ్యి, పదివేల రూపాయల విలువగల ఎలక్టొరల్ బాండ్స్ కాక, పదిలక్షలనుంచి కోటిరూపాయల పరిధిలోనివి 99శాతం అమ్ముడుపోతూ వాటిలో గరిష్టం అధికారపక్షానికే దక్కుతున్నప్పుడు ధనికులు, కార్పొరేట్ సంస్థలు ఈ సదవకాశాన్ని ఎంత చక్కగా వాడుకుంటున్నారో అర్థమవుతూనే ఉంది. సమాచార హక్కుచట్టం పరిధిలోకి రమ్మంటే తాడెత్తున మండిపడిన రాజకీయపక్షాలన్నీ జవాబుదారీతనం, పారదర్శకత వంటివి ప్రజలనుంచి ఆశిస్తూ, తాము మాత్రం వాటికి అతీతమని నమ్ముతాయి. దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది.
ధనంలో కలసిరాని హస్తవాసి...అయినా నిధుల సేకరణలో కాంగ్రెస్ రెండో స్థానం...?
అయితే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం 2017లో కాంగ్రెస్ పార్టీ దగ్గర సుమారు రూ.223 కోట్ల నిధులు ఉన్నాయి. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాస్త తక్కువ మాత్రమే. రూ.1,026 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. ఇప్పటికీ దేశంలోని రెండో ధనిక పార్టీ కాంగ్రెస్సే. అయితే, ఈ పార్టీకి 2017లో సుమారు రూ.35.89 కోట్ల మేర ఆదాయం తగ్గింది.
ఎన్నికల బాండుల్లో బీజేపీకే 95 శాతం
2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే.
ఏమిటీ బాండుల సంగతి...?
భారతీయ స్టేట్ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్‌ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరించిందన్న విమర్శవుంది.
ఎలక్టోరల్ బాండ్స్ గుట్టు విప్పాల్సిందే
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందజేస్తున్న పారిశ్రామికవేత్తల వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇస్తున్న పారిశ్రామికవేత్తలు, సంస్థల వివరాలు ప్రజలు ముఖ్యంగా ఓటర్లకు అవసరం లేదంటూ బీజేపీ అధినాయకత్వం చేస్తున్న వాదన ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల మూలంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపారస్తులు, ఇతర వాణిజ్య ప్రముఖులు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే విధానానికి బీజేపీ రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టటం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే వారి పేర్లు, ఇతర వివరాలను గుప్తంగా ఉంచుతారు. విరాళాల దాతల పేర్లు, వివరాలను గుప్తంగా ఉంచే విధానాన్ని ఇతర రాజకీయ పార్టీలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు తెలియజేయవలసిందేనని కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇందుకు సమ్మతించటం లేదు.
ఈ విరాళాలను అరికట్టకపోతే జరిగే నష్టం...?
పెద్ద పారిశ్రామిక సంస్థ ఒక రాజకీయ పార్టీకి పది కోట్ల విరాళం ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంద కోట్ల లాభం పొందటం ప్రతి పారిశ్రామికవేత్త, సంస్థ నైజం. ఈ లెక్కన బి.జె.పి, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు లేదా టి.ఆర్.ఎస్, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి వంటి ప్రాంతీయ పార్టీలు తమకు లభించే విరాళాలకు ప్రతిగా ఆయా పారిశ్రామికవేత్తలు, సంస్థలకు రెండింతల, మూడింతల ప్రయోజనం కలిగించవలసి ఉంటుంది. ఇలా జరగటం వలన సగటు మనిషికి తీరని అన్యాయం, నష్టం జరిగిపోతుంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా రాజకీయ పార్టీల్లో పెట్టుబడులు పెట్టి ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తమ పెట్టుబడులకు తగు మోతాదులో లాభాలు రాబట్టుకుంటారు. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందే నిధులు అవినీతికి సోపానాలు. ఈ ఉన్నత స్థాయి అవినీతిని అరికట్టాలంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపం లేదా మరో రూపంలో రాజకీయ పార్టీలకు అందే విరాళాల పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల్లో పారదర్శకత లేకపోవటం అంటే అవినీతికి పాల్పడుతున్నట్లే. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాల్లో దాదాపు 95 శాతం నిధులు బి.జె.పికి అందాయి. బి.జె.పి అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ విరాళాలు అందుతాయి. ఎంత ఎక్కువ విరాళాలు అందితే అంతే పెద్ద స్థాయిలో ప్రతి సహాయం (క్విడ్ ప్రోకో) చేయవలసి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తలు, సంస్థల నుండి విరాళాలు తీసుకుని అధికారంలోకి వచ్చిన తరువాత వారు అడిగిన పని చేసిపెడుతున్నారు, ఇలా చేయటం అవినీతి కాదా, రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందే విరాళాల గురించి తెలుసుకోవలసిన అవసరం, హక్కు, అధికారం ప్రజలకు లేదంటూ అటర్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ సుప్రీం కోర్టులో వాదించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.