రచయిత-ముహమ్మద్ ముజాహిద్
సెల్ నెం-96406-22076
ఈ ఏడాది రమజాన్ నెలను విచిత్రమైన పరిస్థితుల్లో జరుపుకోబోతున్నాము. బరువెక్కిన హృదయంతో రమజాన్ కు స్వాగతం పలుకుతున్నాము. ఈ విషాద వాతావరణంలో మస్జిదులు కళతప్పాయి. మస్జిదులలో తరావీహ్ నమాజులతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందే వీలులేకుండా ఉంది. మస్జిదుల్లో నమాజ్, ఖుర్ఆన్ పారాయణాల మధురిమలు, సహరీ, ఇఫ్తార్ల సందడి, వీధుల్లో రమజాన్ వెలుగులు, చిరువ్యాపారుల సందడి ఇవన్నీ పవిత్రమాసంలో ఉండే సందడి. ఎన్నో ఏళ్లుగా రమజాన్ నెలను ఎంతో సందడిగా జరుపుకుంటున్నాము. కానీ 2020 రమాజాన్ నెలలో అలాంటి సందడి కనపబడదు. ఇలా జరుపుకోవడం నిజంగా విషాదమే.
కోవిడ్ -19 విపత్తు దైవశిక్షా? పరీక్షా?...
మానవాళిపై విరుచుకుపడిన ఈ విపత్తు దైవశిక్షనా? లేక దైవ పరీక్షనా అన్న చర్చలు బాగా జరుగుతున్నాయి. ఏ విపత్తు అయినా పాపాత్ములకు శిక్షగా, విశ్వాసులకు దైవపరీక్ష అని అంటారు; హజ్రత్ షాహ్ వలియుల్లాహ్ దహెల్వీ (అలైహిర్మాహ్) అంటారు. విశ్వాసులు ఈ విపత్తును చూసి భయపడకుండా దీన్ని దైవనిర్ణయంగా భావిస్తారు. పాపాత్ములు ఈ విపత్తును చూసి భయోత్పాతానికి గురవుతారు. దైవ కృతఘ్నతకు పాల్పడతారు. విపత్తులు, కష్టాలను వచ్చినప్పుడు ఎవరైతే తమ పాపాలను, తప్పిదాలను అల్లాహ్ ను మన్నించమని వేడుకుంటారో అలాంటి వారికి అవి పరీక్షకాలమే. ఎవరైతే విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడు దైవం వైపునకు మరలకుండా మరింత పాపపంకిలంలో కూరుకుపోతారో అలాంటి వారికిది ముమ్మాటికీ దైవాగ్రహమే అని మౌలానా అష్రఫ్ అలీ థాన్వీ అంటారు. ఈ మహావిపత్తునుంచి ఉపశమనం పొందేందుకు మార్గాలను అన్వేషించాలి. రక్షణ చర్యలను పాటించాలి. ఈ విపత్తు వేళ మేలైన మార్గాన్ని అన్వేషించాలి.
ఈ రమజాన్ విశిష్టమైనదిగా చరిత్రలో నిలిచిపోనుంది. ప్రస్తుతం ప్రపంచం నలువైపులా ఎన్నో సున్నితమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రమజాన్ శిక్షణా మాసం అరుదెంచడం వెనుక అల్లాహ్ నిర్ణయం వెనుక ఏదో నిగూఢం దాగి ఉంటుంది. మనలో మార్పు కోసం పవిత్ర మాసాన్ని ఎలా మలచుకోవాలో, ముస్లిమ్ సమాజంలో ఏలాంటి మార్పును ఆశిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ క్షణంలో ఉన్న పరిస్థితులు మరో క్షణంలో మారిపోతాయి. అది దైవనిర్ణయం. విశ్వాసులను పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయమన్న విషయం ఖుర్ఆన్ చదివితే బోధపడుతుంది. విపత్తులు, ఉపద్రవాలు, విషమ పరీక్షల్లోనూ ఏదోఒక మేలు దాగి ఉంటుందన్నది విశ్వాసి నమ్మకం. అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనిగోరితే అతన్ని పరీక్షలకు గురిచేస్తాడు. పరీక్షల కొలిమిలో కాల్చి నికార్సయిన ముస్లిమ్ గా మారుస్తాడు. ఈ పరీక్షలు సగటు ముస్లిములో నిలకడను కలిగిస్తాయి. పరిస్థితులు ఎంతగా చేయిదాటిపోయినా విశ్వాసి దైవదాస్యానికి కట్టుబడి జీవితం గడపాలన్నది ప్రవక్త ఉద్బోధ. కరుణామయుడైన అల్లాహ్ తన దాసులపై శక్తికి మించిన భారాన్ని మోపడు. మానవ ప్రాణ రక్షణకు ఇస్లామ్ ధర్మం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది.
పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అవతరించినందుకే రమజాన్ నెలకు అంతటి విశిష్టత లభించింది. అందుకు కృతజ్ఞతగా ఉపవాసాలు పాటించాలని, ఉపవాసాల ఉద్దేశాన్ని కూడా ఖుర్ఆన్ బోధించింది. అల్లాహ్ గ్రంథం మనిషి జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను నిర్దేశిస్తుంది. ఉన్నతమైన జీవనశైలిని ప్రబోధిస్తుంది. ఇది మనిషి మేలుకోసం, ఇహపరలోకాల సాఫల్యంకోసం సృష్టికర్త రచించిన పథకమిది. ఖుర్ఆన్ నిర్దేశించిన ఈ పథకాన్ని మనజీవితంలో భాగస్వామ్యం చేసేందుకు, అంతర్భాగం చేసేందుకు స్వీయ అదుపు ఎంతో అవసరం. ఈ అదుపును సాధించాలంటే మనలో విల్ పవర్ కావాలి. దీన్నే ఖుర్ఆన్ తక్వాగా అభివర్ణించింది. తఖ్వా అంటే దైవభీతి. ఈ దైవభీతిని పెంపొందించుకునేందుకు రమజాన్ చక్కని అవకాశం. ఖుర్ఆన్-తఖ్వా-రమజాన్ అనే ముక్కోణపు సిద్ధాంతాన్ని అర్థంచేసుకోవాల్సిన అవసరముంది. రమజాన్ 30రోజుల ట్రైనింగ్ కోర్సుద్వారా ప్రపంచ ముస్లిములకు శిక్షణ ఇవ్వాలన్నదే అల్లాహ్ అభిమతం. ఈ 30రోజుల శిక్షణద్వారా దైవభీతిని సాధించాలి. దైవభీతిని పొంది ఏడాదిపాటు అల్లాహ్ ఆదేశాలను పాలించడం సులువవుతుంది. అందుకే దైవభీతికి ఖుర్ఆన్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. దైవభీతిగలవారే పరలోకంలో సాఫల్యం చెందుతారు అని ఖుర్ఆన్ శుభవార్తనిస్తుంది. ప్రాపంచిక జీవితంలోని కష్టాలను, విపత్తులను ఎదుర్కొనే ధైర్యసాహసాలు కూడా ఈ దైవభీతి ద్వారానే సాధ్యమని ఖుర్ఆన్ అంటోంది.
ఈ పవిత్ర మాసంలో ముస్లిములు దైవారాధనకు ఏకాగ్రచిత్తులవ్వాలి. విరివిగా ఖుర్ఆన్ పారాయణం చేయాలి. రాత్రుళ్లు నమాజులో సుదీర్ఘ సమయం నిల్చుని ఖుర్ఆన్ చదవాలి. దైవగ్రంథం ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటుందో తెలుసుకోగలిగాలి. ఖుర్ఆన్ బోధనల వెలుగులో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్న లోపాలు, బలహీనతలకు అల్లాహ్ ను మన్నింపు వేడుకోవాలి. ఆత్మపరిశీలనతో రమజాన్ ను గడపాలన్నది ప్రవక్త (స) వారి సందేశం.
మన బలహీనతలను, లోటుపాట్లను దూరం చేసుకునేందుకు ఉపవాసం గొప్ప ఆయుధం. ఉపవాసం వుండటం వల్ల విల్ పవర్ సాధించవచ్చు. జీవితాంతం అల్లాహ్ ప్రసన్నత పొందేందుకు మనోవాంఛలను బలివ్వాల్సి ఉంటుంది. మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రమజాన్ శిక్షణ ద్వారా అలవడతాయి. రోజంతా పస్తులుండటం వల్ల పేదల ఆకలి బాధ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ నెలలో జకాత్, ఫిత్రా దానాలతో నిరుపేదలను ఆదుకుంటాము. ఈ నెలలో అలవడిన ధాతృత్వం మిగతా 11నెలలూ పేదలను ఆదుకునే సహృదయత అలవడుతుంది. దైవనామస్మరణ, దుఆ (వేడుకోలు) ఇవన్నీ దైవదాసులకు ఆత్మబలాన్నిస్త్తాయి. రమజాన్ చివరి పది రోజుల్లో ముస్లిములు దైవారాధనల వేడి పెరుగుతుంది. ఏతెకాఫ్, లైలతుల్ ఖద్ర్ ఆరాధనల్లో నిమగ్నులవుతారు. ఈ నెలరోజుల శిక్షణతో శారీరక, మానసిక ప్రక్షాళనం జరుగుతుంది. ఉన్నత వ్యక్తిత్వం అలవడుతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. రమజాన్ స్పిరిట్ ను ముస్లిమ్ సమాజం తెలుసుకుంటే ప్రపంచంలో మహోన్నత స్థానంలో నిలవవచ్చు. ప్రపంచ నాయకత్వం ముస్లిముల పాదాక్రాంతమవుతుంది. మానవాళికి కారుణ్యంగా పరిణవిస్తుంది.
ఏటా మనం రమజాన్ నెలను జరుపుకునే ధోరణి.. చూసేవారికి ఒక ఉత్సవంగా కనబడుతుంది. రమజాన్ వార్షిక పండుగగా మారింది. హైదరాబాద్ లాంటి నగరాలలో ముస్లిమేతర సోదరులు రమజాన్ అంటే హలీం నెలగా భావించేలా మార్చాము. రుచికరమైన ఆహారపదార్థాలు, విద్యుత్తు వెలుగుజిలుగులతో వీధులు వెలుగొందడం ఇవన్నీ రమజాన్ ఆత్మను మరుగునపర్చాయి. ఏదో లాంఛనప్రాయంగా రమజాన్ ఆరాధనలను మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నాము. సహెరీ, ఇఫ్తార్లలో రుచికరమైన ఆహారపదార్థాలు తినే నెలగా భావించి ఎన్నోరమజాన్ లను గడిపాము.
హిజ్రీ శకం 1441 లో జరుపుకోబోతున్న ఈ పవిత్ర మాసం గతంలోకంటే ఎంతో విభిన్నమైనది. ఈ రమజాన్ లో బజారులన్నీ మూసివేసి ఉంటాయి. హోటళ్లన్నీ మూతపడి ఉంటాయి. ఈసారి షాపింగ్ సందడి లేదు. ఇఫ్తార్ తరువాత విద్యుత్తు వెలుగుల్లో రాత్రంతా వీధుల్లో తిరిగే అవకాశమేలేదు. ఇఫ్తార్ విందుల ఊసే లేదు. పూర్తి ఏకాగ్రతతో అల్లాహ్ వైపునకు మరలడమొక్కటే మార్గం. అల్లాహ్ చిహ్నాలపై , ఖుర్ఆన్ పారాయణంపై, నమాజులపై దృష్టిసారించే అవకాశం మాత్రం మెండుగా ఉంది. మనలో చాలామందికి ఉద్యోగాలనుంచి, పని ఒత్తిడి నుంచి కూడా వెసులుబాటు లభించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికీ అంతగా పని ఒత్తిడి ఉండదు. ఈ రమజాన్ 30రోజులూ పూర్తి ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో గడపేపరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఈ లాక్ డౌన్ మీ జీవితంలోనే అత్యుత్తమ రమజాన్ గా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పుకునేలా ఈ రమజాన్ ను మార్చుకోండి. మనమంతా గృహనిర్భంధంలో ఉన్నాము. దైవసాన్నిహిత్యాన్ని పొందేందుకు ఇంతకు మించిన సౌభాగ్యం మరొకటుండదు. 1441 హిజ్రీలో జరుపుకునే ఈ రమజాన్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశిద్దాం!
......................................